
సాక్షి, అమరావతి: నేతల పనితీరు, సర్వేల ప్రకారమే టిక్కెట్లు ఇస్తామని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. కానీ, అదంతా ఉత్తదే, చినబాబుకు డబ్బు మూటలు సమర్పిస్తేనే టిక్కెట్లు కేటాయిస్తున్నారని తెలుగుదేశం పార్టీలోని సీనియర్లు గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు ధృతరాష్ట్రుడి పాత్రకే పరిమితం అవుతున్నారని, చినబాబు చెలరేగిపోతున్నాడని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే తీరు కొనసాగితే పార్టీ పుట్టి మునగడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులు, సీనియర్లు, సమర్థులను పక్కన పెట్టేస్తూ ఏకపక్షంగా టిక్కెట్లు ఖరారు చేస్తుండడం టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ ఆశీస్సులు ఉంటే చాలు సమర్థత, పార్టీ కోసం చేసిన సేవతో నిమిత్తం లేకుండా టిక్కెట్లు దక్కుతున్నాయని అంటున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారుతుండటంతో అకస్మాత్తుగా కొత్త ముఖాలకు పార్టీలో పెద్ద పీట వేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుతో సహా సీనియర్లు చేదు అనుభవాన్ని ఎదుర్కొంటుండటం చర్చనీయాంశంగా మారింది. టిక్కెట్ల కేటాయింపు వ్యవహారం టీడీపీలో ముసలం పుట్టిస్తోంది.
సీనియర్లకు భంగపాటు
టిక్కెట్ల కేటాయింపులో మంత్రి లోకేశ్ ఒంటెత్తు పోకడలతో టీడీపీ సీనియర్లు తీవ్ర భంగపాటుకు గురవుతున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన అశోక్ గజపతిరాజుకు కనీస సమాచారం లేకుండానే కాంగ్రెస్ నేత కిశోర్‌చంద్రదేవ్‌ను టీడీపీలో చేర్చుకున్నారు. ఆయనకు అరకు ఎంపీ టిక్కెట్ ఇచ్చేందుకు పచ్చజెండా ఊపారు. తనకు తెలియకుండానే కిశోర్ చంద్రదేవ్‌కు మాట ఇవ్వడం అశోక్‌గజపతిని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట ఆయన స్వస్థలం ఉన్న రాజాం(ఎస్సీ రిజర్వుడు) నియోజకవర్గంలోనే చెల్లుబాటు కాలేదు. గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాని కోండ్రు మురళీని టీడీపీలో చేర్చుకునేందుకు, రాజాం అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు లోకేశ్ అనుమతి ఇచ్చారు. అనంతరమే కళా వెంకట్రావుకు సమాచారం ఇచ్చారు. దీనిపై కళా కుటుంబసభ్యులు, ఆయన వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెరపైకి కొత్త ముఖాలు
టీడీపీలో టిక్కెట్ల కేటాయింపులో డబ్బు మూటలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌కు కూడా మంత్రి లోకేశ్ దెబ్బ తగిలింది. ఓ బడా కాంట్రాక్టర్ రాజమండ్రి ఎంపీ టిక్కెట్ కోసం మంత్రి లోకేశ్‌తో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా రాజకీయాల్లో లేని ఆయన రాజమండ్రి నుంచి పోటీ చేసేందుకు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. దాంతో మురళీమోహన్‌కు ఈసారి టిక్కెట్ ఇవ్వలేమని చంద్రబాబు సంకేతాలు పంపారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న సీనియర్లు లింగారెడ్డి, వరదరాజులరెడ్డికి మంత్రి లోకేశ్ గట్టి షాక్ ఇచ్చారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి అనూహ్యంగా ప్రొద్దుటూరు రేసులోకి రావడం గమనార్హం. ప్రొద్దుటూరు టిక్కెట్‌ను వీరశివారెడ్డికి ఖాయం చేయాలని టీడీపీ నిర్ణయించడంపై లింగారెడ్డి, వరదరాజులరెడ్డి భగ్గుమంటున్నారు. ఇక మైదుకూరు టిక్కెట్‌ను డీఎల్ రవీంద్రారెడ్డికి కేటాస్తామని సీఎం చంద్రబాబు కొన్ని నెలల క్రితం హామీ ఇచ్చారు. కానీ, తాజాగా టీడీడీ చైర్మన్ పుట్ట సుధాకర్‌యాదవ్‌ను మంత్రి నారా లోకేశ్ తెరపైకి తీసుకొచ్చారు. చంద్రబాబు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో దీనికి అంగీకరించాల్సి వచ్చింది. పార్టీలో సీనియారిటీ, చిత్తశుద్ధి, సమర్థతలను పట్టించుకోకుండా డబ్బు మూటలు ముట్టజెబుతున్న వారికే టిక్కెట్లు ఇస్తున్నారని టీడీపీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment