సాక్షి, అమరావతి/గుంటూరు: మొన్నటి ఎన్నికల్లో చావు దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లోనూ రాజకీయ భవిష్యత్తు లేదని.. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీని తీర్చిదిద్దాలన్నది తమ పార్టీ జాతీయ నాయకత్వ లక్ష్యమని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సభ్యత్వ నమోదు కన్వీనర్ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పరిశీలన నిమిత్తం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం గుంటూరు, కృష్ణా జిల్లా గన్నవరంలలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా 25 లక్షల మందిని పార్టీ ప్రాథమిక సభ్యులుగా చేర్చుకోవాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్టు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగా రూ.17 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని.. ఇప్పటికీ కేంద్రం ఆ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. హోదాకు బదులుగా ప్యాకేజీ తీసుకోవడానికి అంగీకరించిన చంద్రబాబు, కేంద్రం ఇస్తామన్న నిధులను నేరుగా విడుదల చేయాలని కోరారని.. కేంద్రం నేరుగా నిధులు విడుదల చేస్తే అవి తమ జేబుల్లోకి మళ్లించుకోవాలన్నది వారి ఉద్దేశంగా చెప్పారు. కేంద్రం మాత్రం ప్యాకేజీగా ఇస్తామన్న నిధులను నేరుగా కాకుండా వివిధ ప్రాజెక్టులకు విడుదల చేస్తామని చెప్పిందన్నారు.
బీజేపీలో చేరడానికి ఎంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. రాష్ట్రంలో 25 లక్షల మందిని పార్టీ సభ్యులుగా చేర్చడం తమ లక్ష్యమని, అందులో ఎవరైనా ఉండొచ్చంటూ బదులిచ్చారు. పార్టీ ఏపీ ఇన్‌చార్జి రామ్ మాధవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ లేదని, అమెరికాలో తానా సభల్లో మాత్రమే కనిపిస్తోందన్నారు. మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య, టీడీపీ గుంటూరు నగర మాజీ అధ్యక్షుడు చందు సాంబశివరావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ సిద్దావెంకట్రావుతో పాటు పలువురు టీడీపీ నేతలు చౌహాన్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పురంధేశ్వరి, జీవీఎల్ నరసింహారావు, సునీల్ ధియోదర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment