పొత్తులొద్దు | Telangana Congress Reviews Assembly Election Results | Sakshi
Sakshi News home page

పొత్తులొద్దు

Published Sun, Jan 6 2019 12:53 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Telangana Congress Reviews Assembly Election Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో ఇతర పార్టీ లతో పొత్తులొద్దని కాంగ్రెస్‌ నాయకులు పార్టీ అధిష్టానానికి తేల్చి చెప్పారు. కూటమి కట్టొద్దని, ఒంటరిగా పోటీ చేస్తేనే గెలుస్తామని, లేకుంటే మళ్లీ పుట్టి మునగడం ఖాయమని కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేశారు. పొత్తుల్లో జరిగిన జాప్యంతో పాటుగా, తెలంగాణలో చంద్రబాబు ప్రచారం కొంపముంచిందని, ఈ రెండు తప్పులను లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతం కాకుం డా చూసుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమీక్షతో పాటు పంచాయతీ, లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేం దుకు టీపీసీసీ నేతలు వరుసగా రెండోరోజు శనివారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. మహబూ బ్‌నగర్, నాగర్‌కర్నూలు, ఖమ్మం, నల్లగొండ, భువన గిరి లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల పరిస్థితిపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ టీడీపీతో పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి తీరని నష్టం కలిగించిందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబుతో పొత్తు అంశాన్ని రాష్ట్ర ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో టీఆర్‌ఎస్‌ విజయవంతమైనందునే ఘోర పరాభవం ఎదురైం దని, లేదంటే కనీసం 40– 45 స్థానాల్లో గెలిచే వారమన్నారు. లోక్‌సభ స్థానాల అభ్యర్థులను త్వరగా ప్రకటించాలని సూచించారు. 

నాన్చుడు ధోరణి వీడాలి
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడుగానే వెళ్లాలని, ఇకనైనా నాన్చుడు ధోరణి వీడాలని సమావేశంలో నేతలు నిర్ణయించారు. ఈవీఎంల విషయంలో న్యాయపోరాటం చేస్తూనే ప్రజాసమస్యలపై స్పం దించాలని, ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయిం చారు. ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు మాత్రం పొత్తుల విషయంలో భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశా రు. పార్టీ పెద్దలు మాట్లాడుతూ ఏఐసీసీ నిర్ణయం మేరకే టీడీపీతో పాటు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని, లోక్‌సభ ఎన్నికల్లో ఎలా ముం దుకెళ్లాలన్న దానిపై మరోమారు అధిష్టానంతో మాట్లాడతామని చెప్పినట్టు సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, మాజీ మం త్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జి.చిన్నారెడ్డి, నాగం జనార్దనరెడ్డి, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సీతక్క, చిరుమర్తి లిం గయ్య, హర్షవర్ధన్‌రెడ్డి, హరిప్రియానాయక్, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, వంగాల స్వామిగౌడ్‌ తది తరులు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన ముఖ్యనేతలు డీకే అరుణ, రేవంత్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, పొడెం వీరయ్యలు గైర్హాజరయ్యారు. 

టీడీపీతో పొత్తుతోనే ఓటమి: కోమటిరెడ్డి
తెలుగుదేశంతో పొత్తుతోనే ఉద్యోగులు, యువత పార్టీకి దూరమయ్యారని, పొత్తుల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి పాలైందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. సమీక్ష అనంతరం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మహాకూటమి వద్దని అసెంబ్లీ ఎన్నికల ముందే చెప్పానని, లోక్‌సభ ఎన్నికల్లో కూడా పొత్తులు వద్దని సూచించానని తెలిపారు. కూటమి గెలిస్తే చంద్రబాబు పాలన సాగిస్తారనే ప్రచారంతో పాటు ఎవరికి సీటు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో కార్యకర్తలు అయోమయానికి గురయ్యారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులు లేకుండా పోటీ చేస్తే 7 నుంచి 8 స్థానాలు గెలుస్తామన్నారు. తాను నల్లగొండ లోక్‌సభ నుంచి పోటీచేస్తానని, హైకమాండ్‌ అవకాశం ఇస్తే విజయం సాధించి తీరతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement