
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు మహాకూటమి అభ్యర్థుల జాబితాలు వెలువడ్డాయి. సోమవారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత కాంగ్రెస్ 65 మందితో తొలి జాబితా విడుదల చేసిన వెంటనే.. తెలుగుదేశం పార్టీ తొమ్మిది మందితో తన తొలి జాబితా ప్రకటించింది. దీంతో కూటమికి సంబంధించిన మొత్తం 74 స్థానాలకు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించినట్టయింది. అయితే, కాంగ్రెస్ జాబితా విడుదలయ్యే సరికి రాత్రి కావడంతో టీజేఎస్, సీపీఐలు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఆ పార్టీలు మంగళవారం తమ జాబితాలను విడుదల చేసే అవకాశముంది.
ఆ రెండు పార్టీలకు కాంగ్రెస్ ‘షాక్’ : తొలి జాబితాతో కాంగ్రెస్ అధిష్టానం టీజేఎస్, సీపీఐలకు షాక్ ఇచ్చింది. ఆ రెండు పార్టీలు అడుగుతున్న స్థానాల్లోనూ తమ అభ్యర్థులను తొలి జాబితాలోనే ప్రకటించింది. ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్‌పూర్‌లను టీజేఎస్ అడుగుతుండగా.. కొత్తగూడెం స్థానాన్ని సీపీఐ కోరుతోంది. ఈ మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ తొలి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఆ రెండు పార్టీలనూ ఆత్మరక్షణలో పడేసినట్టయింది.
ఉమ్మడి వేదికన్నారు.. హైదరాబాద్‌లోనే అన్నారు..
కూటమి అభ్యర్థులను ఉమ్మడి వేదికగా అన్ని పార్టీలు కలిసి ప్రకటిస్తాయని గతంలో ప్రకటించారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థులను కూడా ఎప్పటిలాగే ఢిల్లీలో కాకుండా ఈసారి హైదరాబాద్ వేదికగా ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. కానీ, ఇవేమీ జరగకుండానే కాంగ్రెస్, టీడీపీలు విడివిడిగా, హడావుడిగా తమ తొలి జాబితాలను ప్రకటించగా.. సీపీఐ, టీజేఎస్‌లు నేడు తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
టీడీపీ తొలి జాబితా ఇదే..!
ఖమ్మం: నామా నాగేశ్వర్‌రావు
సత్తుపల్లి: సండ్ర వెంకటవీరయ్య
అశ్వారావుపేట: ఎం.నాగేశ్వర్‌రావు
వరంగల్ వెస్ట్: రేవూరి ప్రకాశ్‌రెడ్డి
మక్తల్: కొత్తకోట దయాకర్‌రెడ్డి
మహబూబ్‌నగర్: ఎర్ర శేఖర్
ఉప్పల్: తూళ్ల వీరేందర్ గౌడ్
శేరిలింగంపల్లి: భవ్య ఆనంద్ ప్రసాద్
మలక్‌పేట: ముజఫర్ అలీ ఖాన్