
అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ గుర్తు కనిపించకుండా పోనుంది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ పోటీలో లేకుండా పోయింది! మహా కూటమి పేరుతో కాంగ్రెస్‌తో జత కట్టినా, బరిలో నిలిచేందుకు టీడీపీ వెనుకడుగు వేసింది. ఫలితంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగైనట్లయింది.
మోర్తాడ్(బాల్కొండ): ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ జెండా కనుమరుగు కానుంది. ఈవీఎంలలో సైకిల్ గుర్తు కనిపించకుండా పోనుంది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో ఒక వెలుగు వెలిగిన ఆ పార్టీ.. ప్రస్తుతం ఎక్కడ కూడా పోటీలో లేకుండా పోయింది. దీంతో రెండున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీ రెండు జిల్లాల్లో ఉనికే లేకుండా పోయింది. తెలుగు వారిని ఏకం చేయాలనే నినాదంతో ఆనాడు సినీ నటుడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ చరిత్రకు మహాకూటమి పొత్తుతో ఉమ్మడి జిల్లాలో చరమగీతం పాడినట్లయింది. ముందస్తు ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్, టీడీపీలతో పాటు ఇతర రాజకీయ పార్టీలు మహాకూటమిగా అవతరించిన విషయం విదితమే. అయితే, పొత్తులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఏ ఒక్క నియోజకవర్గంలోనూ టీడీపీకి అవకాశం దక్కలేదు. దీంతో ఎన్నికల బ్యాలెట్‌లో సైకిల్ గుర్తు కనుమరుగైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ప్రతిష్ట మసకబారింది
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఉన్న తొమ్మిది నియోజకవర్గాలలో మహాకూటమి తరపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే బరిలో నిలవనున్నారు. ఈ మేరకు హస్తం పార్టీ నేతలకే అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. దీంతో టీడీపీ కథ ముగిసినట్లేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2009 సాధారణ ఎన్నికల సమయంలోనూ ఉమ్మడి జిల్లాలో టీడీపీకి బలమైన పట్టు ఉండింది. ఆ తర్వాతి పరిస్థితుల్లో తెలుగుదేశం క్రమంగా బలహీనపడింది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత టీడీపీ ప్రాభవం పూర్తిగా మసక బారిపోయింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ పార్టీకి ఉనికే లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన తరువాత 2014లో నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున బాల్కొండ, ఆర్మూర్, బోధన్, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాలలో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీకి కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్, అర్బన్ నియోజకవర్గాలను కేటాయించారు. కానీ, ఆ రెండు పార్టీలు విఫలం కాగా, అన్ని నియోజకవర్గాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థులే విజయ ఢంకా మోగించారు.
ముందుకు రాని అభ్యర్థులు!
తాజా ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు మహా కూటమిగా ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను పోటీ చేయించాలని టీడీపీ పట్టుబట్టింది. బాల్కొండ బరిలో మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కుమారుడు డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డిని నిలపడానికి గట్టిగా ప్రయత్నించింది. కానీ ఆయన మహా కూటమి తరపున పోటీ చేయడానికి ఉత్సాహం చూపినా, కాంగ్రెస్ గుర్తు (హస్తం)పైనే పోటీకి ఆసక్తి కనబరిచారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావును పోటీ చేయించాలని తెలుగుదేశం భావించింది. ఆయన కొన్నేళ్ల నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
ప్రస్తుతం ఎన్నికల్లో ఆయన పోటీకి నిరాసక్తతను కనబరచడంతో టీడీపీ తన ప్రయత్నాలను విరమించుకుంది. బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలను మినహాయించి ఇతర నియోజకవర్గాలలో పోటీకి టీడీపీ తరపున అభ్యర్థులెవరూ ముందుకు రాకపోవడంతో అన్ని నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీకి వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఆవిర్బావం నుంచి బాల్కొండ మినహా ఇతర నియోజకవర్గాలలో ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అయితే, తర్వాతి కాలంలో టీడీపీకి నాయకత్వ లేమి, క్యాడర్ ఇతర పార్టీల్లోకి మారడంతో ఆ పార్టీ ఉనికి లేకుండా పోయింది. తాజా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా పోటీ చేయక పోవడంతో ఆ పార్టీ కథ దాదాపు ముగిసిపోయినట్లేనని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment