
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పరిషత్ మొదటి విడత ఎన్నికలకు సోమవారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వెంటనే నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది. జిల్లాలో 3విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదటి విడత దేవరకొండ డివిజన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించి నోటిఫికేషన్ సోమవారం ఉదయం పది గంటలకు విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్లు స్వీకరిస్తారు. దేవరకొండ డివిజన్‌లో 10 మండలాల పరిధిలో 10 జెడ్పీటీసీ, స్థానాలకు 109 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. డివిజన్‌లో 3,10,547 మంది ఓటర్లకు 643 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
నోటిఫికేషన్ విడుదలైన సమయం నుంచే..
మొదటి విడతకు సంబంధించి సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ విడుదలైన సమయం నుంచి ఆ డివిజన్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు సమర్పించవచ్చు. సోమవారం నుంచి ఈనెల 24 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు వీటిని స్వీకరిస్తారు. 25వ తేదీన స్క్రూట్నీ నిర్వహిస్తారు. 26న నామినేషన్లపై ఫిర్యాదుల స్వీకరణ చేపట్టనున్నారు. ఈనెల 28న నామినేషన్లకు సంబంధించి ఉపసంహరణ కార్యక్రమం చేపట్టనున్నారు. ఉపసంహరణల అనంతరం బరిలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తారు. ఆ తర్వాత అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలు చేసుకుంటారు. అయితే మే 6వ తేదీన మొదటి విడతకు సంబంధించి పోలింగ్ జరగనుంది.
ఆన్‌లైన్ ద్వారా నామినేషన్లకు అవకాశం..
నామినేషన్లను నేరుగా కానీ, ఆన్‌లైన్ ద్వారా కానీ సమర్పించుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. ఈ విధానాన్ని గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అమలు చేశారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ విధానాన్ని అమలు చేస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఎవరైనా ఆన్‌లైన్‌ద్వారా నామినేషన్ సమరించవచ్చు. అందుకు సంబంధించిన హార్డ్ కాపీలను కూడా సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. అలా సమర్పిస్తేనే ఆ నామినేషన్ చెల్లుబాటు అవుతుంది.
మండల కేంద్రాల్లోనే జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్
ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జెడ్పీటీసీల నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ప్రతి మండలంలో ఒక్కో రిటర్నింగ్ అధికారిని నియమించారు. ఆ జెడ్పీటీసీకి పోటీ చేసే అభ్యర్థులంతా ఆయా మండలాల్లో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లను అందజేయాల్సి ఉంటుంది. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన ఎన్నికల సందర్భంలో జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీకి పోటీ చేసే అభ్యర్థులంతా జిల్లా పరిషత్‌లోనే నామినేషన్లు సమర్పించారు. ఈసారి మండల కేంద్రాల్లోనే జెడ్పీటీసీ సభ్యులంతా నామినేషన్లు సమర్పించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.
మూడు ఎంపీటీసీలకు ఒకేచోట నామినేషన్లు
మూడు ఎంపీటీసీ నియోజకవర్గాల కేంద్రాలకు ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు. ఆ మూడు ఎంపీటీసీ నియోజకవర్గాల పరిధిలోపోటీ చేసే అభ్యర్థులంతా ఆ రిటర్నింగ్ అధికారి నామినేషన్లను సమర్పిస్తారు. నామినేషన్ల స్వీకరణతోపాటు పరిశీలన, ఉపసంహరణ, ఫిర్యాదుల స్వీకరణతో పాటు రంగంలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన వరకు వారే బాధ్యత నిర్వహించనున్నారు.