పులివెందులలో పోలీసుల బందోబస్తు
సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లా పులివెందులలో రాజకీయం వేడెక్కడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్ష నాయకుల సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అణువణువు తనిఖీలు చేస్తున్నారు. పోలీసు దిగ్బంధంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనాన్ని పులివెందులలోకి రాకుండా పోలీసు బలగాలు అడ్డుకుంటున్నాయి.
సవాల్-ప్రతిసవాల్
పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై ఈ నెల 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు చర్చకు రావాలంటూ టీడీపీ నాయకులు ముందుగా సవాల్ విసిరారు. అధికార పార్టీ సవాల్‌కు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి స్పందించారు. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై పూల అంగళ్ల సర్కిల్ వద్దకానీ, వేంపల్లె అడ్డరోడ్డులోకానీ చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని ఎంపీ ప్రతి సవాల్ చేశారు.
అధికార పార్టీ కుట్ర
ఆదివారం సాయంత్రం చర్చకు వైఎస్సార్‌సీపీ నాయకులు సిద్ధం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే పోలీసులు అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. తమ పార్టీకి చెందిన పులివెందుల మండల నాయకులను పోలీస్‌స్టేషన్‌కు రావాలని హుకుం జారీ చేశారని, సాయంత్రం వరకు స్టేషన్‌లో ఉండాలని వేధిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు. చర్చకు సిద్ధంగా లేకపోవడం వల్లే టీడీపీ ఇలాంటి కుట్రలు చేస్తోందంటున్నారు. అయితే చర్చకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా బందోబస్తు పెంచినట్టు వెల్లడించారు.
నేనొక్కడినే వెళ్తా: అవినాష్‌రెడ్డి
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులను పెద్ద సంఖ్యలో మొహరించారు. చర్చకు రావొద్దంటూ అవినాష్‌రెడ్డిని పోలీసులు కోరారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందనుకుంటే తానొక్కడినే చర్చకు వెళతానని, అధికార పార్టీ నాయకులు ఎంతమంది వచ్చినా తనకు అభ్యంతరం లేదని పోలీసులతో అవినాష్‌రెడ్డి చెప్పారు. ఆయనను గృహనిర్బంధం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment