హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ లో చేరేందుకు రాష్ట్రంలో పలువురు నేతలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు.నిజాం సైన్యానికి వ్యతిరేకంగా ఆనాడు పోరాడిన బైరాన్‌పల్లి, పరకాల వంటి పోరాట కేంద్రాలను తాము అధికారంలోకి వస్తే విజ్ఞాన కేంద్రాలుగా రూపొందిస్తామని .అలాగే అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, గుజరాత్‌లో నిర్మించబోయే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తరహాలో తెలంగాణలో స్టాచ్యూ ఆఫ్ లిబరేషన్‌ను నిర్మిస్తామని చెప్పారు.గురువారం ముషీరాబాద్‌లో లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు.
2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరాటమే చేసి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.అయితే ఇటీవల కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చినప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరును పొగుడుతున్నారని, మీరేమో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా ప్రభుత్వాలు వేరు, పార్టీలు వేరని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అందులోని మంత్రులు ఒకరికొకరు సహకరించుకోవచ్చని, అయితే ఆయా పార్టీల అధ్యక్షులు చెప్పిందే పార్టీ లైన్ అని స్పష్టం చేశారు. ఇటీవల బీజేపీలోకి అనేక మంది వలస వస్తున్నారని, జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హేమాజీ, మాజీ ఎమ్మెల్యేలు నందీశ్వర్ గౌడ్, సత్యవతి, డీఎస్ తనయుడు అరవింద్‌లు పార్టీలో చేరారన్నారు. ఇంకా చాలా మంది ప్రముఖులు అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు.