మమతా బెనర్జీ (ఫైల్ ఫొటో)
సాక్షి, కోల్‌కతా : రాజ్యసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అదరగొట్టింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి సీఎం మమతా బెనర్జీ మరోసారి సత్తా చాటుకున్నారు. పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు ఖాళీగా ఉన్న ఐదు స్థానాలకు గానూ నాలుగు స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులను బరిలోకి దించింది. ఆ నలుగురు అభ్యర్థులు విజయం సాధించడంతో టీఎంసీ శ్రేణులు సంబరాలు చేసుకుంటోంది.
రాజ్యసభకు నేడు (శుక్రవారం) జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ తమ పార్టీ నుంచి అభ్యర్థులుగా సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు నడిముల్ హక్, సుభాశిస్ చక్రవర్తి, అబిర్ బిస్వాస్, సంతును సేన్ లను బరిలో దించగా అందరూ విజయం సాధించారు. మరో స్థానంలోనూ టీఎంసీ బలపరిచిన నేత గెలుపొందారు. టీఎంసీ మద్దతిచ్చిన కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ సైతం గెలుపొందారు. సీపీఎం అభ్యర్థి రణ్ బీర్ దేవ్‌కు వామపక్ష కూటమి మద్దతిచ్చినా సింఘ్వీనే విజయం వరించింది.
ఒక్కో అభ్యర్థి నెగ్గాలంటే 50 ఓట్లు కావాలి. అధికార టీఎంసీకి 213 ఓట్ల బలం ఉండగా, కాంగ్రెస్ కు 42 మంది సభ్యులు, సీపీఎంకు 26 మంది సభ్యుల ఉంది. దీంతో నలుగురు అభ్యర్థులను మాత్రమే గెలిపించుకునే అవకాశం ఉన్నందున మమతా బెనర్జీ తమ పార్టీ నుంచి నలుగురిని ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment