
సాక్షి, ముంబై : కరోనా వైరస్ కారణంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పదవికి గండం ఏర్పడింది. రాష్ట్ర సీఎంగా ఠాక్రే గత ఏడాది నవంబర్ 28న పదవీ బాధ్యతలు స్వీకరించినా.. ఇప్పటి వరకు ఏ సభల్లోనూ (అసెంబ్లీ, మండలి) ఆయనకు ప్రాతినిధ్యం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల లోపు ఉభయ సభల్లో ఏదోఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంది. రానున్న మే 28 నాటికి ఠాక్రే సీఎంగా ఎన్నికై ఆరు నెలల సమయం ముగియనుంది. అయితే ఠాక్రేను శాసనమండలికి నామినేట్ చేయాలని మంత్రివర్గం సిఫారసు చేసినప్పటికీ వివిధ కోటాలో జరగాల్సిన మండలి ఎన్నికలు కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలో మరో నెల ఉద్ధవ్ ఏ సభకూ ఎన్నిక కాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. గవర్నర్ కోటాలో ఉద్ధవ్ మండలికి నామినేట్ చేయాలనే ఆలోచన ప్రభుత్వ వర్గాల్లో ఉంది. అయితే ఆ కోటాలో ప్రస్తుతం ఉన్న ఇద్దరి సభ్యుల పదవీ కాలం మరో రెండునెలల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేవలం రెండు నెలల పదవీకాలం మాత్రమే ఉన్న స్థానంలో ఆయన్ని గవర్నర్ నామినేట్ చేయకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు గవర్నర్ కోటాలో ఉద్ధవ్‌ను ఎంపిక చేయడం సరైనది కాదని ప్రతిపక్ష బీజేపీ నేతలు వాదిస్తున్నారు.
ఏదైనా ఒక పదవికి ఎన్నిక జరగాలన్నా, నామినేట్ చేయాలన్నా దాని పదవీ కాలం కనీసం ఏడాది పాటు అయినా మిగిలి ఉండాలని ఎన్నికల సంఘం ఇదివరకే స్పష్టం చేసినట్లు బీజేపీ నేతలు గవర్నర్ వద్ద ప్రస్తావిస్తున్నారు. దీంతో సీఎం పదవిలో కొనసాగడం సవాలుగా మారునుంది. ఇక కేబినెట్ విజ‍్క్షప్తి మేరకు గవర్నర్ ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేయకపోతే, మే 28 వరకూ కూడా ఎలాంటి కోటాలోనూ ఆయన ఎమ్మెల్సీగా నామినేట్ కాలేకపోతే తప్పనిసరిగా సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.