
ఉండవల్లి అరుణ్‌కుమార్(పాత చిత్రం)
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మండిపడ్డారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘కేంద్రంపై తిరగబడాలని సీఎంకు ఎప్పుడో చెప్పాను.. కానీ అది చేయకుండా చంద్రబాబు యాక్షన్ చేస్తున్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చంద్రబాబు కేంద్రానికి నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇవ్వకుంటే మేము భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తాం. రాష్ట్ర విభజన కాంగ్రెస్, బీజేపీలు కలిసే చేశాయి. నాలుగేళ్లు ఎన్డీయేలో కలసి ఉన్న చంద్రబాబు ఇప్పుడు విడిపోయామంటున్నారు. ఏ పార్టీపైనా నాకు శత్రుభావం లేదు. నిధుల గురించి జనసేన ఇచ్చిన రిపోర్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు’ అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ ఏపీకి ప్రత్యేక హోదా కావాలో.. ప్యాకేజ్ కావాలో తేల్చుకోలేని కన్ఫ్యూజన్‌లో సీఎం ఉండిపోయారు. అందుకే పలుమార్లు మాట మార్చారు. ఏదో ఒకదానిపై చంద్రబాబు స్థిరంగా ఉండాల్సింది. అధికారం కోసం పెట్టుబడులు పెట్టి.. తర్వాత లాభం తీసుకుంటున్నారు. ఈ విధానాన్ని మార్చే ప్రయత్నం జరగాలి. పథకాలకు ఆన్‌లైన్‌లో పాస్‌వర్డ్ విధానం తీసేయాలి. దీంతో వేటికి ఎంత ఖర్చు పెట్టారో ప్రజలకు తెలుస్తుంది’ అని అన్నారు.