
ఉండవల్లి అరుణ్‌కుమార్
సాక్షి, రాజమహేంద్రవరం : ఏపీ విభజన చట్టం చెల్లుబాటు కాదని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంట్‌లో పోరాటం చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సూచించారు. రాష్ట్ర విభజనను బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ కూడా సమర్థించలేదని గుర్తుచేశారు. సభ (పార్లమెంట్)లో ఎన్ని దారుణాలు జరిగాయో అద్వానీకి తెలుసునని, ఇప్పుడు ఇందుకు సంబంధించి నోటీసులిస్తే అద్వానీ అన్ని విషయాలు చెబుతారని అన్నారు. రాజమహేంద్రవరంలో ఉండవల్లి గురువారం మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాని సభలో లేవనెత్తిన అంశంపై చర్చ జరగాలన్నారు. ప్రధాని చెప్పిన మాటలపై నేతలు వివరణ కోరాలని పేర్కొన్నారు.
‘సభ తలుపులు మూసి విభజన చట్టాన్ని ఆమోదింపచేశారు. సభ్యులు ఎవరూ లేరని తెలిసి విభజన బిల్లును ఎలా ఆమోదించారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ విడిపోయింది. కనుక లోక్‌సభలో టీడీపీ ఎంపీలు మాట్లాడటానికి వాళ్లకు ఏం అభ్యంతరం ఉంది. సభలో జరిగిన దారుణాలు ఆద్వానీకి తెలుసు. ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్‌లో రాష్ట్రనేతలు నిలదీయాలి. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిలదీయకుంటే .. ప్రజా ప్రతినిధులుగా ఉండటానికి నేతలు అనర్హులు.
ఏపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలి. అవిశ్వాస తీర్మానాన్ని సభ నిర్ణయించాలి. కానీ అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రాకుండా చేస్తున్నారు. పార్లమెంట్‌లో ఏ నిమిషం ఏం జరిగిందో రికార్డు ఉంటుంది. మీడియాకు పార్లమెంట్ రికార్డులన్నీ నేనే ఇస్తాను. విభజన బిల్లుపై సభలో జరిగిన వాటిపై అందరికీ మెయిల్స్ పంపాను. సభలో కేంద్రం పెద్దలను నిలదీయాలని చెప్పా. కానీ ఎవరూ అలా చేయడం లేదు. ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం నేడు ఏపీ సీఎం చంద్రబాబు (టీడీపీ ఎంపీలు)కు ఉంది. మీకు బాధ్యత ఉందని భావిస్తే దయచేసి ఇప్పుడైనా పార్లమెంట్‌లో ప్రశ్నించాలని’ ఉండవల్లి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment