సాక్షి, హైదదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్ కొనడం అనైతికమని, తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొంటోందని ఆరోపించారు. తమ పార్టీ నాయకులతో కలిసి శాసనసభ ఎదుట రోడ్డుపై ఆయన నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికార పార్టీ నిస్సిగ్గుగా, నిర్లజ్జగా తమ ఎమ్మెల్యేలను కొంటోందని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రజల తీర్పును కేసీఆర్ అవమానపరిచారని, ఆంధ్రా కాంట్రాక్టర్ల సొమ్ముతో తమ ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. స్పీకర్ తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదని, అసెంబ్లీ నుంచి ముఖ్యమంత్రి ఇంటికి పాదయాత్రగా వెళతామని ఉత్తమ్‌కుమార్ తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. ఉత్తమ్‌తో పాటు మల్లు భట్టివిక్రమార్క, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి.. నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనకు అనుమతి ఇవ్వకపోవడంతో రోడ్డుపైనే బైఠాయించారు. (చదవండి: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్)
Comments
Please login to add a commentAdd a comment