సాక్షి, మైలవరం : నిత్యం నీతులు చెప్పే ఏపీ నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమా అసలు బండారం బట్టబయలు అయిందని వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ వసంత కృష్ణప్రసాద్ విమర్శించారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ...ఎన్నికలు సమీపిస్తుండగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా పేదలను మభ్యపెట్టేందుకు తోపుడు బళ్లు పంపిణీ చేస్తూ అడ్డంగా దొరికిపోయారన్నారు. అర్థరాత్రి సమయంలో లారీల్లో తోపుడు బళ్లు తీసుకొచ్చి పంపిణీ చేస్తుండగా వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నించారని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. సమాధానం చెప్పలేక టీడీపీ నాయకులు జారుకున్నారని ఆయన పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న దేవినేని ఉమ చేసేవి మాత్రం పనికిమాలిన పనులు...చెప్పేవి శ్రీరంగనీతులు అని ఎద్దేవా చేశారు.
కాగా ఎన్నికల కోడ్‌ను లెక్క చేయకుండా టీడీపీ నేతలు అర్థరాత్రి తోపుడు బండ్లు పంపిణీ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. టీడీపీ మంత్రి దేవినేని ఉమ అండతో టీడీపీ నేతలు ఆదివారం అర్థరాత్రి ఇబ్రహీంపట్నంలోని కొండపల్లిలో టీడీపీ వార్డ్ మెంబర్ మల్లెంపూడి శ్రీను ఆధ్వర్యంలో తోపుడు బండ్ల పంపిణీ చేశారు. గత వారం వైఎస్సార్‌సీపీ నాయకుడు బొమ్మసాని చలపతి రావు ఇంట్లో ఎన్నికల కోడ్ కంటే ముందే కొనుగోలు చేసిన క్రికెట్, వాలీబాల్ కిట్‌లను పోలీసులు సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అయితే సాక్షాత్తూ మంత్రి అండతో కోడ్ ఉల్లంఘించి, తోపుడు బళ్లు పంపిణీచేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment