సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు బ్యాంకు రుణాలపై హెచ్‌ఆర్‌డీ నిబనంధనలు విధించడంపై రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్బీఏ గుర్తింపు కలిగిన యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు మాత్రమే బ్యాంకు రుణాలు ఇవ్వాలన్న నిబంధనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిబంధనల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తింపు ఉన్న యూనివర్సిటీలు, ఐఐటీ విద్యార్థులకు మాత్రమే 100 శాతం ప్రాంగణ నియామకాలు దొరుకుతాయన్న వాదనలో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఉన్నత విద్య కోసం బ్యాంకు రుణాలు అందించే సౌకర్యంపై షరతులు విధించడం సబబు కాదని, తక్షణమే హెచ్‌ఆర్‌డీ నిబంధనలను ఉపసంహరించుకోవాలని సూచించారు. స్టేటస్ కో అమలు చేయాలని, నాలుగున్నర లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే రుణాలు అందిస్తామన్న నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాలక్ష్మీ పోర్టల్ ద్వారా అన్ని రుణాలు అందివ్వాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment