సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ దళారి స్థాయికి దిగజారి పోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. యూ-టర్నులతో ఎల్లకాలం ప్రజలను మోసగించలేరని తెలుసుకోలేక పోవడం ఆయన కర్మ అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. అమరావతి చుట్టూ నాలుగు గ్రామాల్లో మొసలి కన్నీరు కారుస్తూ పగటి వేషగాడిలా మారిపోయారంటూ ఎద్దేవా చేశారు. రాజధాని అంశంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై విజయసాయిరెడ్డి ట్విటర్‌లో స్పందించారు.
ఈ మేరకు... ‘ ఇన్‌సైడర్ ట్రేడింగులో తన వాళ్లు కొన్న భూముల విలువ పెంచడానికి రాజధాని గురించి చంద్రబాబు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. హైపర్ లూప్ రవాణా, బుల్లెట్ ట్రెయిన్ కనెక్టివిటీ... ఒలంపిక్స్ నిర్వహణ, అక్కడ నివసించే వారి ఆయుష్షు పదేళ్లు పెంచడం...లాంటి నమ్మశక్యం కాని కోతలెన్నో కోశాడు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. (టీడీపీ ఇన్‌సైడర్ ట్రేడింగ్.. ఒక్కొక్కరు ఎంత కొన్నారంటే..)
నక్కజిత్తుల కపట గుణం..
‘రాష్ట్రం నిప్పుల కుంపటి కాదు చంద్రబాబూ. ఐదేళ్ల మీ పాలనలో దోపిడీ, అరాచకాలకు అంతేలేదు. రావణ కాష్టంలా మండించావు రాష్ట్రాన్ని. అందుకే ప్రజలు తరిమి కొట్టారు’ అని విజయసాయిరెడ్డి చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడూ మాట తప్పరని.. అది ఆయనకు వారసత్వంగా వచ్చిన స్వభావమన్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఎప్పడూ మాట మీద ఉండరని.. అది ఆయన నక్కజిత్తుల కపట గుణమని విమర్శించారు. బాబు యూ-టర్నులతో కాలం వెళ్లదీస్తారని.. ఆయన మారాలని ఎవరూ కోరుకోవడం లేదన్నారు. మీరు అలాగే ఉండండి అంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు.
చదవండి: ఫలించిన ఎంపీ విజయసాయి రెడ్డి ప్రయత్నాలు
మీకు అభినందనలు..
ఆంధ్రప్రదేశ ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ దిశ చట్టం-2019 పటిష్ట అమలుకు ప్రత్యేక అధికారికారులుగా నియమితులైన కృతికా శుక్లా, దీపికాకు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. వీరిద్దరి నేత్వత్వంలో దిశ చట్టం పూర్తిస్థాయిలో అమలు అవుతుందని ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా ఏపీ దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఐఏఎస్ విభాగంలో కృతికా శుక్లా, ఐపీఎస్ విభాగంలో దీపికలను దిశ ప్రత్యేక అధికారిణిలుగా ప్రభుత్వం నియమించిన విషయం విదితమే.(ప్రతిష్టాత్మక ‘దిశ’ యాక్ట్‌లోని ముఖ్యాంశాలివే..)
Comments
Please login to add a commentAdd a comment