
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనకు షరతుగా పార్లమెంట్ వేదికగా ఇచ్చిన ప్రత్యేకహోదా మాటను నిలబెట్టుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పక్షనేత విజయసాయిరెడ్డి కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన హోదా అంశాన్ని లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని ఇటీవల నీతి అయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోమన్ రెడ్డి కోరారని, ఆనాడు విభజ ప్రక్రియలో ఉన్న రాజ్యసభ ఛైర్మన్ ఏపీకి న్యాయం చేసేందుకు చొరవ తీసుకోవాలన్నారు. పోలవరాన్ని సవరించిన అంచనాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, ఈ ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతిని నిర్మూలించాలన్నారు. కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు, విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్, కాకినాడ పెట్రో కారిడార్‌ను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ రైల్వే జోన్‌లో మినహాయించిన శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలను చేర్చాలన్నారు.
తమ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించారని, కులం, బంధుప్రీతి, అవినీతితో పెచ్చురిల్లిన టీడీపీని ప్రజలు కూకటివేళ్లతో పెకిలించివేశారని పేర్కొన్నారు. అవినీతి రహిత రాష్ట్రంగా చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ తపన పడుతున్నారని చెప్పారు. ఎవరైనా పార్టీ మారితే ముందుగా వారి పదవులకు రాజీనామా చేయాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో పాస్ చేయించాలని విజ్ఞప్తి చేశారు. తమ సీఎం అంగన్‌వాడీల జీతాలను మూడువేల నుంచి పదివేల రూపాయలకు పెంచారని, అలాగే దేశవ్యాప్తంగా అంగన్‌వాడీల జీతాలు పెంచాలని విజయసాయిరెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment