‘హోదా’, విశాఖ రైల్వేజోన్‌పై స్థాయీ సంఘం పట్టు | Dissatisfaction over delay in setting up of Visakha Railway Zone | Sakshi
Sakshi News home page

‘హోదా’, విశాఖ రైల్వేజోన్‌పై స్థాయీ సంఘం పట్టు

Published Sun, Sep 12 2021 3:07 AM | Last Updated on Sun, Sep 12 2021 3:07 AM

Dissatisfaction over delay in setting up of Visakha Railway Zone - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు అంశాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం పట్టుబట్టింది. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటులో జాప్యంపై వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. సవివర ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) ఇంకా రైల్వే శాఖ పరిశీలనలో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. జోన్‌ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. తీసుకున్న చర్యలపై కమిటీకి నివేదిక అందజేయాలని సూచించింది. అలాగే, రాష్ట్ర విభజన సమయంలో రాజధాని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ రాష్ట్రాలకు కనీసం పదేళ్లకు తగ్గకుండా ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫారసు చేసింది.

ఈ చర్య సమగ్ర అభివృద్ధికి, వాణిజ్యం, ఎగుమతుల్లో ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని పేర్కొంది. ‘ఎగుమతులను పెంచేందుకు మౌలిక వసతుల విస్తరణ’ శీర్షికన రూపొందించిన 164వ నివేదికను పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ వి.విజయసాయిరెడ్డి శనివారం వర్చువల్‌ సమావేశం ద్వారా రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడుకు సమర్పించారు. కొత్తగా ఏర్పాటైన జమ్మూ కశ్మీర్, లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలకు 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేటాయింపులు పెంచడాన్ని కమిటీ ప్రశంసించింది. ఆయా ప్రాంతాల్లో  మౌలిక వసతుల స్థాపనకు, ఆర్థికాభివృద్ధికి, ఎగుమతుల పెంపునకు దోహదపడుతుందని పేర్కొంది. ఇదే తరహాలో ఇతర కొత్త రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లకు కూడా తగిన పరిహారం చెల్లించాలని కమిటీ అభిప్రాయపడుతూ.. రాష్ట్రాల విభజన కారణంగా రాజధానులు కోల్పోయిన ఈ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫారసు చేసింది.

విశాఖ జోన్‌ ఇంకా పరిశీలనలోనా?
విశాఖ జోన్‌కు ఇప్పటికే ఆమోదం లభించిందని, డీపీఆర్‌ ఇంకా మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉందని, కొత్త జోన్‌ కార్యాచరణకు కాలపరిమితిని నిర్ణయించలేమని ఆ శాఖ నుంచి సమాచారం వచ్చిందని కమిటీ తెలిపింది. ‘భారతీయ రైల్వేలలో 5వ అత్యధిక ఆదాయాన్ని అందించే డివిజన్‌ అయిన వాల్తేరు డివిజన్‌ రద్దుకు కారణాలు అడిగితే విశాఖలో జోనల్‌ ప్రధాన కార్యాలయం ఏర్పాటు అవుతున్నందున పరిపాలన ప్రాతిపదికన మాత్రమే విశాఖలో డివి జన్‌ కేంద్రాన్ని తీసివేశామని రైల్వే శాఖ తెలిపింది. వాల్తేరు డివిజన్‌ కొనసాగింపు రోజువారీ కార్యకలాపాలలో గానీ, ఈ ప్రాంత దీర్ఘకాలిక రైల్వే అభివృద్ధిలో ఎటువంటి విలువను జోడించదని ఆ శాఖ తెలిపింది. వాల్తేరు డివిజన్‌ను పొరుగున ఉన్న విజయవాడ డివిజన్‌లో విలీనం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది రాదని, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఆధారిత వ్యవస్థలను విస్తృతంగా ఉపయోగించడం వల్ల వ్యవస్థ సజావుగా సాగుతుందని తెలిపింది.

కొత్త సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నప్పుడు, డివిజన్‌ కార్యాలయం మినహా విశాఖ కేంద్రంగా ఉన్న ప్రస్తుత రైల్వే వ్యవస్థ చాలా వరకు అలాగే ఉంటుందని, వాల్తేరు డివిజనల్‌ ఆఫీస్‌తో సహా విశాఖలో ప్రస్తుతం ఉన్న రైల్వే సిబ్బందిలో ఎక్కువ మంది విశాఖలోనే సాధ్యమైనంత వరకు అక్కడే ఉంటారని కమిటీకి సమాచారం అందించింది. పరిపాలనా, కార్యాచరణ అవసరాలతో సహా అన్ని సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు కమిటీకి తెలిపింది’ అని స్టాండింగ్‌ కమిటీ పేర్కొంది. వాల్తేరు డివిజన్‌ను ముక్కలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నామంది. వాల్తేరు డివిజన్‌ను కుదించే నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని స్టాండింగ్‌ కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. 

మిరప ఎగుమతులకు శీతల గిడ్డంగులు..
గుంటూరు నుంచి ప్రతినెలా 1.80 లక్షల టన్నుల మిరప పంట ఎగుమతి అవుతుందని, వీటికి సాధారణ గిడ్డంగులు కాకుండా శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖతో సమన్వయం చేసుకుని గుంటూరు జిల్లాలో తగిన సంఖ్యలో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని వాణిజ్య శాఖకు కమిటీ సిఫారసు చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement