సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన శాపం గురించి ఎంఐఎం శాసనసభ సభ్యుడు అక్బరుద్దీ ఒవైసీకి తెలియకపోవచ్చని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి అన్నారు. కేసీఆర్ పెట్టిన శాపం గురించి తెలియకే గాంధీ ఆస్పత్రిపై ఒవైసీ విమర్శలు చేసివుంటారని పేర్కొన్నారు. కరోనా వైరస్ బాధితులకు వైద్యం అందిస్తున్న గాంధీ ఆసుపత్రి జైలు మాదిరిగా ఉందని ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై విజయశాంతి ఫేస్‌బుక్‌లో వ్యంగ్యంగా స్పందించారు.
‘కరోనా మహమ్మారిపై పోరులో అందరూ ప్రభుత్వానికి బాసటగా నిలవాలని సీఎం కేసీఆర్ ఇటీవల విలేకరుల సమావేశంలో కోరారు. అంతటితో ఆగకుండా గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేవని రాసిన మీడియా యజమానికి కరోనా వైరస్ సోకాలని శాపం పెట్టారు. వైద్య సదుపాయాలు లేవు అన్నందుకే కరోనా రావాలన్న కేసీఆర్.. మరి గాంధీ ఆసుపత్రి జైలు మాదిరిగా ఉందని విమర్శించిన అక్బరుద్దీన్‌కు ఎలాంటి శాపనార్థాలు పెడతారోనని తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు. బహుశా కేసీఆర్ పెట్టిన శాపం గురించి ఓవైసీకి తెలిసి ఉండకపోవచ్చు. లేదా కేసీఆర్, తాము ఒకటే కనుక ఈ శాపాలు తనకు వర్తించవని అక్బరుద్దీన్ ధీమాగా ఉండి ఉండొచ్చు. లేదా తమకు ఈ శాపాలు తగలవని... తాము అన్నిటికీ అతీతమని అక్బరుద్దీన్ భావించి ఉండొచ్చు. మరి రాబోయే రోజుల్లో అక్బరుద్దీన్‌కు కేసీఆర్ శాపం పెడతారా? లేక చూసీ చూడకుండా సర్దుకుపోతారా అనే విషయాన్ని వేచి చూడాలి’ అంటూ విజయశాంతి ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment