
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను వార్డుల వారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం మర్రి శశిధర్‌రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో జరిగిన కమిటీ సమావేశం తీర్మానించింది. వార్డుల వారీ ఓటర్ల జాబితాను పంచాయతీ కార్యాలయాలతో పాటు వెబ్‌సైట్‌లో ఉంచడం ద్వారా పారదర్శకత తీసుకురావాలని ఎన్నికల సంఘాన్ని కోరింది.
ఓటర్ల జాబితాల తయారీ క్రమంలో అధికార టీఆర్‌ఎస్ దుర్వినియోగానికి పాల్పడకుండా, కాంగ్రెస్ సానుభూతి ఓటర్లను తొలగించకుండా ఆయా గ్రామాలు, వార్డుల్లోని కాంగ్రెస్ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మే 1, 3 తేదీల్లో రాజకీయ పార్టీలతో జరిగే సమావేశాలకు జిల్లా, మండల స్థాయి కాంగ్రెస్ ప్రతినిధులు విధిగా హాజరుకావాలని పార్టీ శ్రేణులను కోరింది. సమావేశంలో ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు జి.నిరంజన్, ప్రేమలత అగర్వాల్, టి.రాజేశ్వర్, టి.నరేందర్, పి.రాజేష్ పాల్గొన్నారు.