విజయవాడ: ప్రజలను వంచించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి దీక్ష చేసే అర్హత లేదని, ఏప్రిల్ 30న వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో పాల్గొనే అందరూ నల్లజెండాలు పట్టుకుని, నల్లబాడ్జీలు ధరించి పాదయాత్ర చేస్తారని ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్సార్‌సీపీ తిరుపతి ఎంపీ వరప్రసాద్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ..నాలుగేళ్ల నుంచి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ నాలుగేళ్ల పాలనలో ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఏప్రిల్ 30న ఏపీకి జరిగిన అన్యాయాన్ని నల్లజెండాలతో పెద్ద ఎత్తున తెలియజేస్తామని వివరించారు.
మరో వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ..హోదా హామీ అమలు కాకపోవడానికి కారణం చంద్రబాబేనన్నారు.హోదాకు వంచన చేసింది ముమ్మాటికీ చంద్రబాబేనని మండిపడ్డారు. ఈ నెల 30వ తేదీని వంచన దినంగా పాటిస్తామని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.విశాఖలో ఏప్రిల్ 30న వంచన దినాన్ని పెద్ద ఎత్తున జరుపుతామని వివరించారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో పాల్గొనే అందరూ నల్లజెండాలు, నల్లబ్యాడ్జీలు ధరించి, ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసన ద్వారా ప్రజలకు, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment