తన నివాసంలో మనోజ్ తివారీతో వాడి వేడి చర్చలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ : సరిగ్గా మంగళవారం ఉదయం 9గంటల ప్రాంతం. బీజేపీ ఢిల్లీ నగర అధ్యక్షుడు మనోజ్ తివారీ, ఐదురు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మహిళా మేయర్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిలోకి సీలింగ్ డ్రైవ్ వ్యవహారంపై చర్చించేందుకు అడుగుపెట్టారు. కేజ్రీవాల్ సమావేశ మందిరంలోకి వారు అడుగుపెట్టారో లేదో అక్కడి వారిని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ ఆమ్‌ఆద్మీపార్టీ ఎమ్మెల్యేలతోపాటు బౌన్సర్లు కార్యకర్తలు మొత్తం కలిపి 150మంది వరకు ఉన్నారు. వీళ్లేమో మొత్తం కలిపి 20మందే. ఈలోగా అరవింద్ కేజ్రీవాల్ వచ్చి బీజేపీ నేతలకు స్వాగతం చెప్పి కూర్చోవాలని కోరారు. అయితే, సమావేశ మందిరంలో ఇంతమంది ఎందుకని, ఇదేదో సమస్యపై ప్రసంగించే అసెంబ్లీ కాదని, వారందరిని బయటకు పంపిస్తే కూర్చుంటామని చెప్పారు.
ఇదే విషయాన్ని కేజ్రీవాల్‌కు బీజేపీ నేత విజేందర్ గుప్తా, ఎంపీ రమేశ్ బిదూరి పునరావృతం చేశారు. కేజ్రీవాల్ మాత్రం వారిని కూర్చోవాలని మాట్లాడుకుందామని మళ్లీ చెప్పారు. ఢిల్లీ ప్రజల భవిష్యత్‌కు సంబంధించిన విషయం కాబట్టి బహిరంగంగా మాట్లాడుకోవడంలో తప్పేమీ లేదని బీజేపీ నేతలతో చెప్పారు. కానీ, తివారీ మాత్రం ఆయన మాటలు వినేందుకు నిరాకరించి ఏదో విషయాన్ని చెప్పబోతుండగా వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జితేంద్ర సింగ్ తోమర్ గట్టిగా అరుస్తూ 'నీ ఉపన్యాసాలు వినడానికి కాదు మేం ఇక్కడ కూర్చుంది' అన్నారు. దీంతో బీజేపీలోని 20మంది నేతలకు ఆగ్రహం వచ్చింది. వెంటనే కేజ్రీవాల్ ఇంటి నుంచి బయటకు వస్తుండగా అందులోని 150 మంది ఆప్ నేతలు, కార్యకర్తలు, బౌన్సర్లు పకపకా నవ్వారు.
దీంతో మరింత చిర్రుబుర్రులాడుతూ కేజ్రీవాల్ సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే వారు వెళ్లే సమయంలో ఒక్కరు కూడా బయట లేకపోగా తిరిగి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే దాదాపు 2000మంది ఆప్ నేతలు అక్కడ పోగయ్యారు. వారి మధ్య నుంచి వెళ్లే సమయంలో మరోసారి జితేంద్ర సింగ్ వేగంగా పరుగెత్తుకుంట తివారీని అడ్డగించి బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఓ గందరగోళ వాతావరణ నెలకొంది.
దీనిపై మనోజ్ తివారీ స్పందిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ పక్కా ప్లాన్ ప్రకారం ఈ పనిచేసిందని, ఓ ముఖ్యమైన అంశంపై చర్చ జరిగే సమయంలో ఇంతమంది కార్యకర్తలను తెప్పించుకోవాల్సిన అవసరం ఏముందని మండిపడ్డారు. మహిళా మేయర్లు అని కూడా చూడకుండా ఆప్ కార్యకర్తలు గుండాల్లాగా ప్రవర్తిస్తూ దాడికి దిగారని చెప్పారు. నగర మావోయిస్టుల్లాగా ఆప్ కార్యకర్తలు తయారయ్యారని మండిపడ్డారు. వారు దాడి కారణంగా విజేందర్ గుప్తా కూడా గాయాలు అయ్యాయని ఈ ఘటనపై తాము పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేసింది. అసలు విషయాన్ని చర్చించడం బీజేపీ నేతలకు ఇష్టం లేకే వెళ్లిపోయారని ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment