సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే దానిపై పలువురు మంత్రులు ఊగిసలాడుతున్నారు. ఇంతవరకు ఎన్నికల్లో పోటీ చేయని పలువురు ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా మరికొందరు తమపై వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని సురక్షిత స్థానాల కోసం పావులు కదుపుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రివర్గంలో ముఖ్యులుగా ఉన్న వారు పోటీ చేసే స్థానాలపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి.
రాజధాని వ్యవహారాల్లో కీలకంగా ఉన్న మంత్రి నారాయణ ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక దశలో చిత్తూరు జిల్లా తిరుపతి స్థానంపై దృష్టి పెట్టినా చివరికి నెల్లూరు సిటీ వైపే మొగ్గు చూపుతున్నారు. చంద్రబాబుకు సన్నిహితంగా ఉండి గత ఎన్నికల్లో నేరుగా పోటీ చేయకుండా తెరవెనుక మంత్రాంగం నడిపి టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మంత్రి అయిన నాటి నుంచి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు.
లోకేష్‌కు సురక్షిత స్థానం కోసం అన్వేషణ
విమర్శల ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు ఈసారి తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్ ఇటీవలే ప్రకటించారు. దొడ్డిదారిన మంత్రివర్గంలో చేరారని, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేదని ఆయనపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన సులువుగా గెలిచే నియోజకవర్గం కోసం అన్వేషిస్తున్నారు. మొదట్లో కృష్ణా జిల్లా పెనమలూరును పరిశీలించినా అక్కడ అంత ఈజీ కాదని తేలడంతో విరమించుకున్నారు.
తన మామ, సినీ హీరో బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం అయితే బాగుంటుందనే అభిప్రాయం వచ్చినా, కుటుంబంలో ఇబ్బంది వస్తుందని వెనకడుగు వేస్తున్నారు. ఇవన్నీకాదు సొంత జిల్లా చిత్తూరు జిల్లా నుంచే పోటీ చేస్తే బాగుంటుందని, అదీ చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. చంద్రగిరిపైనా వారి దృష్టి కనిపిస్తోంది. అయితే చివర్లో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ ఆలోచనే విరమించుకునే అవకాశం కూడా లేకపోలేదు.
పక్కచూపులు చూస్తున్న దేవినేని ఉమ
కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు ఈసారి మైలవరాన్ని వదిలివేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రిగా ఉండి చక్రం తిప్పినా నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఆయన చూపు నూజివీడుపై పడినట్లు తెలుస్తోంది.
వరుసగా రెండుసార్లు మైలవరం నుంచి గెలిచిన నేపథ్యంలో ఈసారి ప్రజలు మార్పు కోరుకునే పరిస్థితులున్నాయని ఆయన అనుమానిస్తున్నారు. మంత్రయ్యాక ఆయన తీరు మారిపోయిందని సొంత క్యాడరే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మైలవరంలో తాను హ్యాట్రిక్ కొడతానని పైకి చెబుతున్నా లోలోపల మాత్రం ప్రత్యామ్నాయ సీటు కోసం చూస్తున్నారు. అయితే దేవినేని ఉమ విజయవాడ పార్లమెంటు అభ్యర్థి అయ్యే అవకాశం కూడా ఉందనే చర్చ సాగుతోంది.
డోలాయమానంలో గంటా
విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు మళ్లీ భీమిలి నుంచి పోటీ చేసే అవకాశం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తాను భీమిలిని వదిలేది లేదని ప్రకటించినా చివర్లోనైనా నియెజకవర్గం మార్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆయన టీడీపీని వదిలి వేరే పార్టీలోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక మంత్రులు అచ్చెంనాయుడు, ఆదినారాయణరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సీట్లకు గ్యారంటీ కనిపించడంలేదు. అచ్చెంనాయుడు, ఆది, పుల్లారావులను ఎంపీలుగా పోటీ చేయించే ఆలోచన చంద్రబాబు చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
సీటు డౌటే
ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్థానానికి గ్యారంటీ కనిపించడంలేదు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి గెలిచిన ఆయన వచ్చే ఎన్నికల్లో ఆ సీటును దక్కించుకోవడం కష్టమేనని చెబుతున్నారు. ఆ సీటు కోసం రాజప్ప ప్రత్యర్థి బొడ్డు భాస్కరరామారావు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండడం, అది ఆయన సొంత నియోజకవర్గం కావడంతో రాజప్ప సీటు గల్లంతేనని ప్రచారం జరుగుతోంది. ఆయనపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో పార్టీ అధినేత సీటు ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment