
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వచ్చిన ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇంతకాలం తాత్సారం చేస్తూ వస్తోన్న కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం సాయంత్రం హఠాత్తుగా మంగళవారం ఉదయం సమావేశమై ఈ ఫిర్యాదులపై విచారణ జరుపుతామని ప్రకటించింది. మోదీ, అమిత్ షాలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించడం, సుప్రీం కోర్టు ఈ అంశంపై విచారణ జరపాలని నిర్ణయించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మంగళవారం సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో అంటే, ఎన్నికలకు సంబంధించిన అంశం సుప్రీం కోర్టు పరిశీలనకు వెళ్లినప్పుడు ఎన్నికల కమిషన్ అందులో జోక్యం చేసుకోదు. సుప్రీం కోర్టు నిర్ణయానికే వదిలిపెడుతుంది. సుప్రీం తీర్పును బట్టి నడుచుకునేందుకు సిద్దంగా ఉంటుంది. ఈసారి అందుకు విరుద్ధంగా మోదీ, అమిత్‌షా, రాహుల్‌కు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై మంగళవారం సమావేశం అవుతున్నట్టు ప్రకటించడంలో ఏదో మతలబు ఉండే ఉంటుంది. అయితే సుప్రీం కోర్టు ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంశాన్ని మంగళవారం నాడు విచారిస్తుందనే విషయం తెలియకముందే తాము మంగళవారం నాటి సమావేశాన్ని ఖరారు చేసుకున్నామని ఎన్నికల కమిషన్ అంటోంది. మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం నాడు విచారించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచీ సోమవారం ఉదయమే నిర్ణయించింది.
మంగళవారం నాడు సమావేశమై తాము ఈ అంశాన్ని పరిశీలించాలని అంతకన్నా ముందే నిర్ణయం తీసుకున్నామని ఆ వెంటనే ఎన్నికల కమిషన్ ఎందుకు ప్రకటించలేదు? ఆ రోజు సాయంత్రం వరకు ఎందుకు నిరీక్షించాల్సి వచ్చింది? సుప్రీం కోర్టు విచారణ గురించి తెలిసాక సంప్రదాయం ప్రకారం, తనకన్నా సుప్రీం అధికారాలు కలిగిన సుప్రీం కోర్టుకే వదిలేయకుండా ఎందుకు ఫిర్యాదులను విచారిస్తానని ప్రకటించాల్సి వచ్చింది. సుప్రీం కోర్టు అయితే కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, తానయితే చిన్న చిన్న శిక్షలతో సరిపెట్టవచ్చనే ఉద్దేశమా? ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ తనకు ఎన్నో ఫిర్యాదులు ఎందరిపైనో అందినప్పటికీ కింది స్థాయి నాయకులపై మాత్రమే చర్యలు తీసుకుంది. ఒకటి, రెండు రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదంటూ వారిపై చిన్న చిన్న శిక్షలు విధించింది.
తనకు ఓటు వేయకపోతే ముస్లింల సంగతి చూస్తానంటు హెచ్చరించిన సుల్తాన్‌పూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ ఎన్నికల ప్రచారంపై కూడా ఎన్నికల కమిషన్ 48 గంటల నిషేధం విధించింది. అయితే మేనకా గాంధీ, తనకు ఏయే ప్రాంతాల్లో ఓట్లు ఎక్కువ వచ్చాయో, ఏయే ప్రాంతాల్లో ఓట్లు తక్కువ వచ్చాయే గుర్తించి ఆయా ప్రాంతాలను ఏ,బీ,సీ,డీ ప్రాంతాలుగా కేటిగిరీ చేస్తానని, తద్వారా ఎక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని, తక్కువ వచ్చిన ప్రాంతాలను పట్టించుకోనంటూ ఓటర్లును బెదిరించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఫిర్యాదులు చేసిన ఎన్నికల కమిషన్ పట్టించుకోకపోవడంతో దీనిపై కూడా ఆ పార్టీ సోమవారం నాడు కోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఇక ముందు ఇలాంటి హెచ్చరికలు పునరావృతం అయితే తగిన చర్యలు తీసుకుంటానంటూ సోమవారం నాడు మేనకా గాంధీకి ఈసీ నోటీసు జారీ చేసింది. చర్యలకు మాత్రం ఉపక్రమించలేదు.
వారిపై చర్యలు అనుమానమే ?
మేనకా గాంధీపైనే చర్యలు తీసుకునేందుకు సాహసించలేకపోయిన ఎన్నికల కమిషన్, ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలపై చర్యలు తీసుకుంటుందని ఆశించడం అత్యాశే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొదటి నుంచి బీజేపీకి మిత్రుడైన ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వారిపై చర్యలు తీసుకుంటారన్న నమ్మకం లేదని వారు ఆరోపిస్తున్నారు.
మోదీపై, అమిత్ షాలపై ఆరోపణలు ఏమిటీ ?
గత ఫిబ్రవరి నెలలో జరిగిన పుల్వామా ఉగ్ర దాడిగానీ, అందుకు ప్రతీకారంగా భారత వైమానిక దళం పాక్‌లోని బాలకోట్‌పై జరిపిన బాంబు దాడులనుగానీ ఎన్నికల ప్రచారం కోసం వాడుకోరదంటూ ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ వైమానిక దాడిలో పాల్గొని వీరోచితంగా విడుదలై వచ్చిన భారత వింగ్ కమాండర్ అభినందన వర్థమాన్ చిత్రపటాన్ని బీజేపీ ప్రచారం కోసం ఉపయోగించగా, వెంటనే ఆయన ఫొటోలను తొలగించాలని ఆదేశించడమే కాకుండా భారత సైన్యాన్ని కూడా ఎన్నికల ప్రచారం కోసం వాడుకోరదంటూ తాజా మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.
అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచారంలో ఈ అంశాలన్నింటిని ప్రస్తావిస్తున్నారు. పాకిస్థాన్‌పై దాడి జరిపిన దేశ సైనికులకు తమ ఓటును అంకితం ఇవ్వండంటూ కూడా ఓటర్లకు పిలుపునిచ్చారు. నేడు దేశం సురక్షితంగా ఉన్నదంటే అది ఒక్క బీజేపీ ప్రభుత్వం వల్లనే సాధ్యమైందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశం చిన్నాభిన్నం అవుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇక అమిత్ షా, బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ‘మోదీజీ కా వాయు సేన’ పాకిస్థాన్‌పై దాడి జరిపిందంటూ మాట్లాడారు. ఆయన ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా మతాల ప్రస్థావన కూడా తీసుకొస్తున్నారు. ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఎన్నికల నినాదం కూడా ఎన్నికల కమిషన్ పరిశీలనలో ఉంది.
సంబంధిత వార్తలు
Comments
Please login to add a commentAdd a comment