
సాక్షి, లక్నో: కాంగ్రెస్ పార్టీ ఆశాదీపం ప్రియాంక గాంధీ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పార్టీ ఆదేశిస్తే తాను జాతీయ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమేనని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వెల్లడించారు. హైకమాండ్ కోరితే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమేనంటూ క్లారిటీ ఇచ్చేశారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు.
గత జనవరిలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక గాంధీ అభిమానులకు శుభవార్త అందించారు. అలాగే ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి అరంగేట్రంపై ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిందించారు. మరోవైపు ఎక్కడ నుంచి ఆమెను బరిలోకి దింపాలన్న సమాలోచనల్లో సీనియర్ నేతలు మునిగిపోయారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తనకు బరిలోకి దిగాలని లేదని, పార్టీ కోసం పని చేయాలనే ఆశిస్తున్నాననీ.. కానీ పార్టీ ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేస్తానని ప్రియాంక వెల్లడించారు. బుధవారం అమేథిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియాంక ఈ వివరణ ఇచ్చారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన సోదరుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీలో పర్యటించిన ప్రియాంక, 2022 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారా? ఈ ఎన్నికలు కాదు. 2022 ఎన్నికలకు (యూపీ అసెంబ్లీ ఎన్నికలు) ఆ ఎన్నికలకు మీరు తీవ్రంగా కష్టపడాలంటూ ఆమె పార్టీ శ్రేణులను కోరారు. మరోవైపు ఈ సందర్భంగా ఆమె బీజేపీపై తన దాడిని ఎక్కు పెట్టారు. వేలాదిమంది రైతులు తీవ్ర సంక్షోభంలో మునిగిపోయారని, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి సహాయం అందడం లేదని విమర్శించారు. ఉద్యోగాల కల్పనలో కేంద్రం దారుణంగా విఫలమైందన్నారు. కనీస ఆదాయ పథకంపై వస్తున్న విమర్శలను ఆమె తోసి పుచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎపుడూ ద్రోహం చేయదనీ, ఏం చెప్తుందో అదే చేస్తుందన్నారు.
కాగా యూపీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ప్రియాంక గాంధీ నియమితులైన వెంటనే, ప్రియాంక తల్లి, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్థానంలో రాయబరేలి నుంచి ఆమె పోటీ చేయనున్నారనే వార్తలు హల్‌చల్ చేసాయి. అయితే తొలి జాబితాలోనే సోనియా గాంధీ పేరు చేర్చి ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దీంతో ప్రియాంక ఎక‍్కడినుంచి బరిలో వుంటారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.