సాక్షి, విశాఖ సిటీ : ‘మహానేత వైఎస్సార్‌ని రెండుసార్లు మాత్రమే కలిశాను. ఆయనకు ప్రతిపక్షం, అధికార పక్షమనే తేడా లేదు. సీఎంగా ఉన్నప్పుడు అన్ని పార్టీలనూ సమానంగా చూశారు. చంద్రబాబుది మాత్రం దానికి పూర్తి వ్యతిరేకమైన మనస్తత్వం. అందుకే రాజన్న రాజ్యం తర్వాత ఇప్పుడు రావణరాజ్యంలా మారిపోయింది. ఇప్పుడు రాష్ట్రానికి జగన్ ఓ భరోసా. పెద్దాయనలాంటి పాలన అందిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. తమకు నిజమైన సోదరుడు వైఎస్ జగన్ అని ప్రతి మహిళలోనూ బలంగా నాటుకుపోయింది’ అని విశాఖ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అక్కరమాని విజయనిర్మల అన్నారు. ఆమె ‘సాక్షి’తో పంచుకున్న అంతరంగం ఆమె మాటల్లోనే..
అనుకోకుండా అవకాశం..
నా భర్త వెంకటరమణ రాజకీయ నాయకుడిగా భీమిలి ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 2005లో కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకున్న సమయంలో మా స్థానం మహిళకు కేటాయించడంతో అనుకోకుండా నాకు అవకాశం వచ్చింది. అప్పటికే సామాజిక సేవలో ప్రజలకు సుపరిచితురాలినై ఉండటంతో గెలుపు అవకాశం తలుపు తట్టింది. రాజకీయాల్లోకి వస్తే.. ప్రజాసేవ చేసేందుకు మరింత అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతో ఆ బాటలో ప్రయాణించాను.
వైఎస్సార్ వ్యక్తిత్వానికి ముగ్ధురాలినయ్యాను..
2008 డిసెంబర్‌లో రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లతో సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి సమీక్ష నిర్వహించారు. అప్పుడే పెద్దాయనను తొలిసారి చూశాను. ముఖ్యమంత్రి అంటే.. గంభీరంగా ఉంటారు, కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులతోనే మాట్లాడతారన్న ఆలోచన ఉండేది. కానీ.. ఆయన్ని చూడగానే నా ఆలోచన తప్పు అని అర్థమైంది. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి చిరునవ్వుతో పలకరించారు. అందరితో సరదాగా మాట్లాడి సమస్యలన్నీ సానుకూలంగా విన్నారు. భీమిలి సమస్యల గురించి చెప్పగానే టీడీపీ అని తెలిసి కూడా.. రాజన్న స్పందించిన తీరు చూసి ఆయన వ్యక్తిత్వానికి ముగ్ధురాలినయ్యాను. మున్సిపాలిటీ బిల్డింగ్ కోసం రూ.50 లక్షలు, మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.17 కోట్లు, మురికివాడల అభివృద్ధికి రూ.3.35 కోట్లు.. ఇలా చెప్పిన సమస్యలన్నింటికీ నిధులు మంజూరు చేశారు.
రాజన్నకి.. చంద్రబాబుకి తేడా అదే..
నేను టీడీపీకి చెందిన చైర్‌పర్సన్‌నని వైఎస్సార్‌తో అన్నాను. ఆయన చిరునవ్వు నవ్వి.. నువ్వు ఏ పార్టీ అయితే ఏంటమ్మా.. మా రాష్ట్రంలోనే ఉన్నావుగా.. నీ మున్సిపాలిటీ అభివృద్ధి చెందితే.. ఏపీలో ఒక ప్రాంతం అభివృద్ధి చెందినట్టే కదా.. అని నవ్వుతూ బదులిచ్చారు. ఇంకా ఏమైనా ఇబ్బందులుంటే చెప్పండన్నారు. నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఒక ముఖ్యమంత్రి అంతటి విజన్‌తో ఆలోచిస్తారా! అని అనుకున్నాను. చంద్రబాబుకీ, వైఎస్సార్‌కు ఉన్న తేడా అదే. రాజన్న రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడతారు. చంద్రబాబు మాత్రం తన ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్న ప్రాంతాలకే నిధులు ఇస్తారు. ప్రతిపక్ష పార్టీ అంటే చాలు రూపాయి కూడా ఇవ్వకుండా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందనీయరు. ఇటీవలే ఓ వేదికపై ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే అంగీకరించారు కదా.. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడితో.. రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది.?
మళ్లీ జగన్‌లో చూశాను..
పెద్దాయన మరణించాక.. నాకు చాలా బాధనిపించింది. 2011లో ఆయన తనయుడు జగన్‌మోహనరెడ్డి పార్టీ ఏర్పాటు చేసినప్పుడు 2012లో విజయమ్మ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాను. చిన్నవాళ్లకు మర్యాద ఇచ్చే నైజం జగన్‌లో చూసినప్పుడు రాజన్నే గుర్తొచ్చారు. బహుశా.. జగనన్న వ్యక్తిత్వాన్ని దగ్గరి నుంచి చూసిన వారెవరూ ఆయన్ని విడిచి వెళ్లే ఆలోచన చేయరు.
నడిచొస్తున్న నమ్మకాన్ని చూశా..
విశాఖలో ప్రజాసంకల్ప యాత్ర అడుగుపెట్టినప్పటి నుంచి పాదయాత్రలో పాల్గొన్నాను. అన్ని జిల్లాల్లోనూ జరిగిన పాదయాత్రను ప్రసార మాధ్యమాల్లో చూశాను. నడిచొస్తున్న నమ్మకంలా ప్రజలకు జగన్ కనిపించారు. ఆయనొస్తేనే మళ్లీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం ప్రజలందరిలో నాటుకుపోయింది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా..
రాజన్న బిడ్డను గెలిపించుకుందామా అన్నట్టు ఎదురుచూస్తున్నారు.
వెలగపూడి ఇక విజయవాడకే...
పదేళ్ల పాటు తూర్పు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామకృష్ణబాబు ప్రజలకు ఏం చేయలేదు. కేవలం ఆయన మద్యం వ్యాపారాన్ని, నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారే తప్ప.. ప్రజల బాగోగుల గురించి ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. గుర్రపు పందేలు, జూదాలు.. ఇలా ప్రజల సొమ్ముల్ని దోచుకుతినే ఎమ్మెల్యేగా చరిత్రపుటల్లో నిలిచిపోతారు. విశాఖ వంటి మహా నగరంలో తూర్పు నియోజకవర్గంలోని 3 వార్డుల్లో ఒక్క బస్టాప్ కూడా లేదంటే ఆయన పనితీరు ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా.. ఇప్పుడు మళ్లీ బెదిరింపు ధోరణులతో ఓటు వేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికల తర్వాత.. ఎక్కడి నుంచైతే వెలగపూడికి వచ్చారో.. అక్కడికి రిటర్న్ వెళ్లిపోవాల్సిందే.
అతివలకు అసలైన సోదరుడు
చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళా అధికారులపై ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు దాష్టికానికి పాల్పడిన ఘటనలు ఎన్నో చూశాం. ఎన్నికలు రాగానే మహిళలపై ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తూ.. పసుపు కుంకుమ అంటూ చంద్రబాబు మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ.. మహిళలెవ్వరూ ఆయనను నమ్మే పరిస్థితి లేదు. అన్ని వర్గాల మహిళలకూ అండగా నిలబడేందుకు జగన్ వచ్చారు. ఆయన్ని చూస్తే.. మా అందరికీ అసలైన సోదరుడిగా అండగా ఉంటారన్న నమ్మకం కలిగింది. ఏ పార్టీ ఇవ్వనన్ని సీట్లు మహిళలకు కేటాయించారంటే.. మహిళా సాధికారత జగన్ వల్లే సాధ్యమవుతుందని స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment