సాక్షి, అమరావతి : మోసం చేయడం, అబద్ధాలు ఆడటం తమ ఇంట, వంట లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తమ మేనిఫెస్టోను ప్రజలకు చూపించామని.. అది చూసే ప్రజలు తమకు ఓట్లు వేశారని తెలిపారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత టీడీపీ సభ్యులు ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను వక్రీకరించే ప్రయత్నం చేశారు. దీనిపై స్పందించిన సీఎం వైఎస్ జగన్ టీడీపీ సభ్యులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తమ మేనిఫెస్టో చూసి ప్రజలు ఓట్లు వేసినందుకు గర్వంగా ఉందన్నారు. టీడీపీ సభ్యులకు మరింత క్లారిటీ కావాలంటే తాను ప్రజాసంకల్పయాత్రలో ఏం మాట్లాడాలో వినాలని సూచించారు. అందుకు సంబంధిచిన వీడియోను డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అనుమతితో అసెంబ్లీలో ప్రదర్శించారు.
అయితే టీడీపీ ఆరోపణలపై తొలుత స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి.. ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో నాలుగు విడతలుగా రూ. 75 వేల ఇస్తామన్నా విషయాన్ని గుర్తుచేశారు. తమ మేనిఫెస్టోలో కూడా ఇదే విషయాన్ని చెప్పామని అన్నారు. చంద్రబాబులా మోసం చేసే అలవాటు తమకు లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలపై ప్రతిపక్ష నేత చంద్రబాబుది కపట ప్రేమ అని మండిపడ్డారు. టీడీపీ ఎవో పాత పేపర్లు పెట్టి రాజకీయం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. గతంలో టీడీపీ ఇచ్చిన 600 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. టీడీపీలా వక్రబుద్ధి తమకు లేదన్నారు. మేనిఫెస్టో తమకు భగవద్గీతతో సమానం అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment