సాక్షి, అమరావతి : శాసనమండలిని రద్దు చేస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గతంలో ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేసినప్పుడు ఈనాడులో ఆ నిర్ణయాన్ని కీర్తిస్తూ ఎడిటోరియల్స్ రాశారని అన్నారు. ఆనాడు కేవలం ఈనాడు అధిపతి రామోజీరావు కోసమే మండలిని రద్దుచేశారని గుర్తుచేశారు. కానీ నేడు కోట్లాది మంది ప్రజాప్రయోజనాల కోసం మండలి రద్దు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో ఏపీ శాసన మండలి రద్దు తీర్మానంపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘ముఖ్యమైన నిర్ణయంపై నేడు శాసనసభ సమావేశం జరుగుతోంది. మండలి రద్దు అనేది విషయం కాదు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మండళ్లు కచ్చితంగా అవసరం అనుకుంటే ప్రతి రాష్ట్రంలో మండలి ఏర్పాటు అయి ఉండేది. ఇప్పుడు 28 రాష్ట్రాల్లో కేవలం 6 రాష్ట్రాలకు మాత్రమే మండళ్లు ఉన్నాయి. మాకు మండళ్లు వద్దని అసోం, మధ్యప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు కోరుకున్నాయి. ఆర్టికల్ 169 ప్రకారం మండలి రద్దు అధికారం కూడా శాసనసభకే ఉంది. ప్రస్తుతం సభలో ఇంజనీర్లు, డాక్టర్లు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, రైతులు ఉన్నారు. వీరంతా ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలు.
మండలి ద్వారా ప్రజా ప్రయోజనాలకు ఆటంకం కలుగుతోంది. రాజకీయ అజెండాతో మండలిలో ప్రజలకు మేలు చేసే బిల్లులను అడ్డుకున్నారు. మండలిలో కేవలం బిల్లును ఎలా అడ్డుకోవాలనేదే ఆలోచిస్తున్నారు. మండలికి ఏడాదికి రూ. 60 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఒక దండగ పనికి ఇంత సొమ్ము ఖర్చు చేయడం అవసరమా అనే ఆలోచన చేయాలి. మండళ్లు చేసిన సవరణలను శాసనసభ ఆమోదించనక్కర్లేదు. శాసనమండలిని కొనసాగిస్తే.. మరో కొద్ది రోజుల్లోనే అక్కడ వైఎస్సార్‌సీపీకి మెజారిటీ వస్తోందని అందరికీ తెలుసు. కానీ అన్ని అంశాలను ఆలోచించి ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆపరేషన్.. ఆకర్ష్ అంటూ చంద్రబాబు పత్రికలు సిగ్గుమాలిన వార్తలు రాశాయి. ఓటుకు కోట్లు ఇస్తూ చంద్రబాబు ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోతే ఎల్లో మీడియా కనీసం నోరెత్తలేదు. మా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే అప్పుడు ఈనాడు, ‘చంద్ర’జ్యోతి, టీవీ5 ఎందుకు ప్రశ్నించలేదు?. మా ప్రభుత్వం ఎమ్మెల్సీలకు రూ. 5 కోట్లు ఆఫర్ చేస్తుందని దిక్కుమాలిన రీతిలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు లాగా నేను చేస్తే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా రాదని ఎప్పుడో చెప్పాను. కానీ మేము అలా చేయడానికి రాలేదు. రాజకీయాలను మార్చడానికి అధికారంలోకి వచ్చామ’ని స్పష్టం చేశారు.
అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్, శాసమండలి, ప్రత్యేక హోదా విషయాలపై చంద్రబాబు ఎలా మాటలు మార్చారో తెలిపే వీడియోను స్పీకర్ తమ్మినేని సీతారాం అనుమతితో సభలో ప్రదర్శించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని కొనసాగిసూ.. ‘ప్రత్యేక హోదాపై చంద్రబాబు గడికో మాట మాట్లాడారు. సోనియాను తిట్టారు.. మళ్లీ కాంగ్రెస్‌తోనే కలిశారు. మోదీని తిట్టిన చంద్రబాబు.. అదే మోదీని మెచ్చుకుంటూ మాట్లాడతారు. ఏ విషయంలో చంద్రబాబుకు స్థిరత్వం లేదు. మండలి విషయంలోనైనా క్లారిటీగా ఉన్నారంటే అది కూడా లేదు. అవసరం తీరితే కూతురిని ఇచ్చిన మామను పొడవడానికి కూడా చంద్రబాబు వెనుకడాడు.
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ల చట్టాన్ని, పేద విద్యార్థులకు మేలు చేసే ఇంగ్లిషు మీడియం చట్టాన్ని మండలిలో అడ్డుకున్నారు. వికేంద్రీకరణను కూడా అడ్డుపడ్డారు. అమరావతి రైతులకు అన్ని రకాలుగా న్యాయం చేస్తాం. రైతుల కౌలును 10 నుంచి 15 ఏళ్లకు పెంచడం అన్యాయమా?. అసైన్డ్ రైతులకు రైతులతో సమానంగా ప్లాట్లు ఇస్తాం. రైతు కూలీల భృతిని రూ. 2,500 నుంచి రూ. 5 వేల పెంచుతున్నాం. చంద్రబాబులాగా గ్రాఫిక్స్‌లో జపాన్, సింగపూర్ లాగా అభివృద్ధి చేస్తామని చెప్పడం లేదు. ప్రజల కోసం చట్టాలు చేస్తుంటే రాజకీయ అజెండాతో అడ్డుపడుతున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన తప్పిదాలకు రిపేర్లు చేస్తున్నాం. అన్ని ప్రాంతాల అభివృద్ది కోసం వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చాం. అమరావతిని లెజిస్లేటివ్ రాజధానిగా ఇక్కడే కొనసాగిస్తూ.. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించాం. అందరికి న్యాయం చేయడానికి ప్రయత్నించడం తప్పా’ అని ప్రశ్నించారు. మంచి చేయాలనుకున్నప్పుడు ఏ సమయమైనా మంచిదేనని అమెరికా పౌర హక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ వ్యాఖ్యలను సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అనంతరం శాసనమండలి రద్దు తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment