సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఏ పార్టీతోనూ పొత్తు లేదని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌కు ప్రజలతోనే పొత్తు అని విజయమ్మ తెలిపారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరులో జరిగిన బహిరంగ సభలో వైఎస్ విజయమ్మ ప్రసంగించారు. సింహం సింగిల్‌గానే వస్తుందని.. వైఎస్ జగన్ తీసుకువచ్చే నవరత్నాలు అందరికీ మేలు చేస్తాయని తెలిపారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మూడు దఫాలుగా మద్యపాన నిషేదం అమలు చేస్తామని పేర్కొన్నారు.
ఇంకా విజయమ్మ మాట్లాడుతూ..‘ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్నాయి. విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని ప్రజలను కోరుతున్నా. తన పాలన కాలంలో ఏం చేశారో చెప్పి ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఓట్లు అడిగారు. ఈ ఐదేళ్లలో చంద్రబాబు ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారు?. ఎన్ని కష్టాలు పెట్టినా.. వైఎస్ జగన్ ప్రజల మధ్యలోనే ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. హోదా కోసం వైఎస్ జగన్ ధర్నాలు, దీక్షలు చేశారు. ఐదేళ్లలో చంద్రబాబు చేసిందంతా మోసం.. మళ్లీ అవే అబద్ధాలతో మీ ముందుకు వస్తున్న చంద్రబాబును నమ్మకండి. ఇసుక నుంచి గుడి భూముల వరకు టీడీపీ నాయకులు అన్నీ దోచేశారు. చంద్రబాబుకు విలువలు, విశ్వసనీయత లేదు.
తాగునీరు దొరకడంలేదు..
ప్రతి ఒక్కరినీ మోసం చేయడమే చంద్రబాబు లక్ష్యం. అన్ని వర్గాలకు మేలు చేసింది వైఎస్సార్ మాత్రమే. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారు. మాట మీద నిలబడే వ్యక్తిత్వం చంద్రబాబుది కాదు. పొదుపు సంఘాల రుణాలు 26 కోట్ల రూపాయలకు పెరిగిపోయాయి. పసుపు కుంకుమ పేరుతో మరో డ్రామా ఆడుతున్నారు. 13 జిల్లాలో సాగునీరు గురించి పక్కన పెడితే.. తాగునీరు దొరకని పరిస్థితి. గ్రామాల్లో తాగునీరు దొరక్కపోయిన.. మద్యం ఎంతకావాలో అంత దొరుకుతుంది. ఎక్కడ కూడా నిరుద్యోగ భృతి ఇచ్చినట్టుగా కనిపించడం లేదు. ఎన్నికల వేళ ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో అబద్దపు ప్రచారాలు చేస్తున్నారు.
మళ్లీ 108 వస్తుంది...
ప్రజలపై భారం పడకుండా, ధరలు పెంచకుండా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్‌ది మాత్రమే. వైఎస్సార్ పాలనలో అందరికి అండగా ఉన్న 108 మళ్లీ వైఎస్ జగన్ అధికారంలో రాగానే ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఉంటుంది. నవరత్నాలతో వైఎస్ జగన్ మీ అందరి జీవితాల్లో వెలుగు నింపుతారు. డ్వాక్రా రుణాలు మహిళల చేతుల్లోకి నేరుగా అందేలా వైఎస్ జగన్ ఏర్పాటు చేస్తారు. వైఎస్ జగన్ చెప్పకుండా ఉంటే చంద్రబాబు ఎన్నికలకు ముందు పింఛన్‌ను 2 వేల రూపాయలు చేసేవారా?. వైఎస్ జగన్ పింఛన్ 3వేల రూపాయలకు చేరుస్తారని ప్రతి అవ్వ తాతకు చెప్పండి. వైఎస్ జగన్ హామీలనే చంద్రబాబు అనుకరిస్తున్నారు. చంద్రబాబు పరిస్థితి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంది. ఎక్కడున్నా పులి.. పులే.
అన్నదాతలు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి..
చంద్రబాబు పాలనలో పింఛన్ కోసం కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. అన్నదాతలు సైతం కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి. 2014 ఎన్నికల సమయంలో 600కు పైగా వాగ్ధానాలు ఇచ్చి చంద్రబాబు అధికారం దక్కించుకున్నారు. అందులో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. చంద్రబాబుకు మానవత్వం లేదు. 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొన్నారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఉద్యోగాలకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ జగన్ అధికారంలోకి రావాలి.
వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తారు. గిరిజనులు భూములకు పట్టాలు ఇస్తారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తారు. అంతేకాకుండా గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తారు. పెట్టుబడి సాయంగా రూ. 12, 500 అందిస్తారు. విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తారు. అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడంతో పాటుగా ఎన్నికల నాటికి ఉన్న బకాయిలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తారు. గ్రామా సచివాలయాల ద్వారా ఏ పని కావాలన్నా 72 గంటల్లోనే పూర్తి చేసేలా చూస్తాం. రైతు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి 7లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతి, ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌లను అత్యధిక మోజారిటీతో గెలిపించండ’ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment