సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19న ఆంధ్రప్రదేశ్‌లో బీసీ గర్జన నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి తెలిపారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో భేటీ అనంతరం పలు కీలక విషయాలు మీడియాకు వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న బీసీలంతా ఈ గర్జనకు తరలిరావాలని పిలుపునిచ్చారు. బీసీ కులాల స్థితిగతులను, జీవన ప్రమాణాలను తెలుసుకునే ఉద్దేశంతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఏడాదిన్నర క్రితం బీసీ అధ్యయన కమిటీ నియమించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అధ్యయన సమావేశాలు నిర్వహించామని, అధ్యయన కమిటీ ద్వారా అనేక అంశాలతో కూడిన నివేదికను సోమవారం వైఎస్ జగన్‌కు అందజేశామని పేర్కొన్నారు. వాటి గురించి వైఎస్ జగన్ పూర్తి స్థాయిలో సమీక్షించారని తెలిపారు. (పార్టీ బీసీ నేతలతో వైఎస్ జగన్ కీలక భేటీ)
నవరత్నాలు కాపీ కొడుతున్నారు..
వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టి చంద్రబాబు.. వాటినే మళ్లీ కొత్తగా చెబుతున్నారని కృష్ణమూర్తి మండిపడ్డారు. 2014 మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను టీడీపీ ఏమేరకు అమలు చేసిందని ప్రశ్నించారు. టీడీపీ నేతలు బీసీలను అణగదొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను ప్రలోభ పెట్టి, వారి ఓట్లు వేయించుకుని చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. బీసీ న్యాయవాదులను న్యాయమూర్తులు కాకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని.. ఈ విషయాన్ని స్వయంగా జస్టిస్ ఈశ్వరయ్య చెప్పారని పేర్కొన్నారు. బీసీలకు అన్ని విధాలా అన్యాయం చేసిన చంద్రబాబుకు జయహో బీసీ అనే అర్హత లేదని విమర్శించారు. తమ అధ్యయనంలో భాగంగా సంచార జాతులను కూడా కలిశామని.. కొంత మంది బీసీలకు తమ కులం ఏమిటో కూడా స్పష్టంగా తెలియదనడం చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు.
మొసలి కన్నీరు కారుస్తున్నారు..
ఓట్లు కొల్లగొట్టాలనే ఆలోచన తప్ప బీసీల పట్ల చంద్రబాబుకు ప్రేమ లేదని వైఎస్సార్ సీపీ నేత కొలుసు పార్థసారథి విమర్శించారు. మెడికల్ సీట్ల విషయంలో బీసీలు నష్టపోతున్నా టీడీపీ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌పై ఒక్కమాట కూడా మాట్లాడని చంద్రబాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ప్రతి కాబినెట్ మీటింగ్‌లో భూములు, ఇసుక గురించి చర్చించారు.. ఒక్క బీసీకైనా ఎకరా భూమి కేటాయించారా అని ప్రశ్నించారు. బీసీల జీవితాలు మార్చడానికి చంద్రబాబు ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. ఫెడరల్ ఫ్రంట్ విషయమై కేటీఆర్.. జగన్‌ని కలిస్తే నిస్సిగ్గుగా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ పథకాలనే కాపీ కొడుతున్న చంద్రబాబుకు అసలు సిగ్గుందా అంటూ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment