సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖలో హత్యాయత్నం జరిగిన ఘటనపై టీడీపీ నేతల మాటల తీరులో కసి, ఓర్వలేనితనం స్పష్టంగా కన్పిస్తున్నాయని వైఎస్సార్ సీసీ నేత కొలుసు పార్థసారథి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయ అవసరాలకు వాడుకుంటూ, నేర ప్రవృత్తి కలిగిన టీడీపీ నేతలు క్రూర మృగాల్లా మాట్లాడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేతను కనీసం పరామర్శించే హుందాతనం లేని సీఎం చంద్రబాబు నాయుడు ఇతర పార్టీల నేతలు ఆయనను పరామర్శిస్తే ఓర్చుకోలేక పోతున్నారని విమర్శించారు. అబద్ధపు హామీల నుంచి బయట పడటానికి, ప్రజల దృష్టి మరల్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ఇంకా మాట్లాడుతూ.. ఆపరేషన్ గరుడ నిజమేనేమోనన్న బాబు వ్యాఖ్యలు వింటుంటే.. దాన్ని రచించింది చంద్రబాబేనన్న అనుమానం తమకూ కలుగుతోందన్నారు. ఒకవేళ ఆయనకు ముందుగానే ముఖ్యనేతపై దాడి జరుగుతుందని తెలిసి ఉంటే ప్రభుత్వం తరపున చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
నిష్పక్షపాత విచారణ కావాలి..
మధ్యాహ్నం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే సాయంత్రం 4.30 గంటల వరకు తనకు సమాచారం లేదని సీఎం అంటారు.. కానీ 2 గంటలకే డీజీపీ ఈ ఘటనపై మాట్లాడతారు. అయినా విచారణ జరపకముందే నిందితుని మానసిక స్థితి సరిగా లేదని డీజీపీ ఎలా చెబుతారంటూ పార్థసారథి ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థపై నమ్మకం ఉంది గానీ.. ఈ సంఘటనలు చూస్తుంటే ఆ వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తుల మీద అనుమానం కలుగుతోందన్నారు. విచారణను పక్కదోవ పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అందుకే ఈ విషయంలో జోక్యం చేసుకుని నిష్పక్షపాత విచారణ చేపట్టాలని కేంద్ర హోం మంత్రిని కోరతామని పార్థసారథి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment