
సాక్షి, పెనమలూరు : రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. నియోజకవర్గంలోని ఉయ్యూరులో ఎమ్మెల్యే రైతుబజార్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని, అలాగే డ్వాక్రా మహిళలకు కూడా వడ్డీలేని రుణాలు ఇచ్చి అక్కాచెల్లెళ్లకు చేయూతగా నిలిచి వారు ఆర్థికంగా ఎదగడానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గ్రామ వలంటీర్ల పేరుతో లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామని గుర్తుచేశారు. మా ప్రభుత్వం అసెంబ్లీలో చారిత్రాత్మకమైన బిల్లులను ప్రవేశపెడితే తెలుగుదేశం పార్టీ స్వాగతించకపోగా సభను అడ్డుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజాశ్రేయస్సుకోరే బిల్లులను మేం ప్రవేశపెట్టడాన్ని జీర్ణించుకోలేకే సభలో గందరగోళ వాతావరణం సృష్టించారని ఎద్దేవా చేశారు. వారికి మాట్లాడడానికి తగిన సమయం ఇచ్చినప్పటికి కూడా సభా సమయాన్ని దుర్వినియోగం చేసి ప్రజా సమస్యలపై చర్చ జరగకకుండా అడ్డుపడ్డారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని అవరోధాలు సృష్టించినా జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని స్పష్టం చేశారు.