వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్ధసారధి
సాక్షి, పెడన: రైతులకు రెండు పంటలకు నీరిచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదే అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్ధసారధి అన్నారు. బలహీన వర్గాల వారిని జడ్జీలు కాకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని, ఆయన ఏ సమయంలోనూ బలహీన వర్గాలకు సాయం చేయలేదని గుర్తుచేశారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పెడనలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతకానితనం కారణంగా రైతులు పొట్ట చేతపట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారని విమర్శించారు. గతంలో తొమ్మిదేళ్ల పాలనలో ఒక పంటకు నీరు ఇవ్వని చంద్రబాబు.. ప్రస్తుతం ఈ నాలుగేళ్లలో కూడా అదే తీరు కొనసాగిస్తున్నారంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్ పాలనతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
పారిశ్రామికవేత్తలకు ఏవిధంగా భూములు, ఇతరత్రా ఆస్తులు కట్టబెడదామన్నదే టీడీపీ నేతల విధానమంటూ ఎద్దేవా చేశారు. దివంగత నేత వైఎస్సార్ తన హయాంలో రైతులకు రెండు పంటలకు నీరు ఇచ్చారని కొనియాడారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనలో.. రైతులు తాము పండించిన పంటను అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. పంటలు అమ్ముకోవాలంటే పాస్‌బుక్‌లు, ఈ– పాస్ అంటూ చంద్రబాబు దద్దమ్మ ప్రభుత్వం పాలన సాగిస్తుందని ధ్వజమెత్తారు. నాడు వైఎస్సార్ హయాంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేవని చెప్పారు. అర్హులైన పేదలకు పింఛన్లు, రేషన్‌కార్డులు వైఎస్సార్ అందించారు, కానీ ప్రస్తుతం చంద్రబాబు పాలనలో రైతులు, సామాన్యులు, అన్ని వర్గాలవారు మోసపోయారని పార్ధసారధి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment