
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా తయారీలో అవకతవకలపై చర్చించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు గురువారం ఎన్నికల ప్రధాన అధికారి ఆర్పీ సిసోడియాతో భేటీ అయ్యారు. గల్లంతయిన ఓట్లలో ఎక్కువగా వైసీపీ కార్యకర్తలు, సానుభూతి పరుల ఓట్లే ఎక్కువగా ఉన్నాయని ఎన్నికల అధికారికి తెలిపారు. నియోజకవర్గాల వారిగా ఓట్ల గల్లంతు జాబితాను సిసోడియాకు అందజేశారు.
అనంతరం ఈ విలేకరులతలో మాట్లాడుతూ.. ఓటర్ల నమోదు ప్రక్రియను మరో నెల పెంచాలని ఎన్నికల అధికారిని కోరినట్లు తెలిపారు. అయితే ఇది జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన అంశం కాబట్టి సీఈసీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారన్నారు. ఆర్టీజీ, పల్స్ సర్వే పేరుతో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని చంద్రబాబు ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీకున్న సమాచారం ప్రకారం 48. 61 లక్షల ఓట్లను తొలగించారన్నారు. డూప్లికేషన్ ఓట్ల పేరుతో మరో 11 లక్షల ఓట్లు తొలగించారని తెలిపారు.
ఈ సారి ఎన్నికల్లో గెలవలేనని తెలిసిన చంద్రబాబు గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ప్రభావం లేకుండా ఓటర్ల జాబితా రూపకల్పన జరగాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని.. కొన్ని లొసుగులున్నాయని స్వయంగా ఎన్నికల ప్రధాన అధికారే అన్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని తెలిపారు.