సాక్షి, చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌లో అరాచక,అవినీతి పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ నాయకులు ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 30 యాక్టు,144 సెక్షన్ల ఎందుకు విధించారని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో ఇంచార్జి అరని శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్మించిన వైఎస్సార్ సీపీ పార్లమెంటు కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి తదితరులు హాజరయ్యారు. టీడీపీ పాలనపై ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు ధ్వజమెత్తారు.
అప్పుడు కిరణ్.. ఇప్పుడు బాబు: పెద్దిరెడ్డి
‘ఎవరితోనైనా చంద్రబాబు పొత్తు పెట్టుకోవడానికి వెనకాడడు. గతంలో 600 హామీలు ఇచ్చారు. నాలుగున్నర సంవత్సరాల్లో విపరీతంగా అప్పులు చేశారు. ఏ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చెయ్యలేదు. కేంద్రం నిర్మిస్తానన్న పోలవరం, చంద్రబాబు తన సొంత వ్యక్తులకు కట్టబెట్టుకున్నారు. రాష్ట్రాభివృద్ధి కన్నా సొంత విషయాలపై శ్రద్ధ. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి, ప్రస్తుతం చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. ఒకరేమో 16 నెలలు జైల్లో పెట్టిస్తే, మరొకరు చంపే యత్నం చేశారు. ఇద్దరు ఈ జిల్లా వాళ్లే కావడం ఇబ్బందికరంగా ఉంద’ని పుంగనూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
జగనన్నకు మహిళాదరణ: రోజా
‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మహిళలకు గౌరవం ఇస్తోంది. ఎన్నో సమస్యలపై పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మహిళలు ఎంత ఆదరణ ఇస్తున్నారో పాదయాత్ర ద్వారా తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలి. ఎప్పుడూ చంద్రబాబు ఒంటిరిగా పోటీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డికి పాదయాత్రలో వస్తున్న స్పందన చూసి జగన్ అనే వ్యక్తిని లేకుండా చేయాలని బాబు ప్రయత్నం చేశారు. కేసులున్న క్రిమినల్ని ఎలా ఎయిర్‌పోర్టు రెస్టారెంట్‌లో పెట్టుకున్నారు. దాడి తర్వాత ప్రతిపక్ష నేత జగన్‌పై ఏవిధంగా టీడీపీ నాయకులు మాటల దాడి చేశారో అందరూ చూశార’ని నగరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు.
బాబూ.. ఇప్పుడేమంటావ్: బొత్స
‘రాజకీయ చైతన్యమున్న జిల్లా చిత్తూరు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వైఎస్ఆర్ ఎంతమేరకు అభివృద్ధి చేశారో జిల్లా ప్రజలకు తెలుసు. టీడీపీ నాయకులపై ఐటీ దాడులు చేస్తేనే బాబుకు దేశం గుర్తుకు వచ్చింది. రామాయపట్నం పోర్టు ప్రైవేట్ వారికి కట్టబెట్టే యత్నం చేస్తున్నారు. పెద్దనోట్ల రద్దు నా మాట మీదే జరిగిందన్నావు. మరి ఇప్పుడు ఏమంటారో చెప్పాల’ని చంద్రబాబు నుద్దేశించి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
క్లిష్టంగా చంద్రబాబు పరిస్థితి: ఉమ్మారెడ్డి
‘మోదీకి వ్యతిరేకంగా పోరాడాలని చంద్రబాబు చాలా రాష్ట్రాలు వెళ్లి వస్తున్నారు. వారందరూ నాలుగేళ్లుగా మోదీకీ వ్యతిరేకంగా పోరాడుతున్నవారే. కొత్తగా మీరు కూడగట్టిన నాయకులెవరూ లేరు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు. మరి చంద్రబాబు చేసిందేమిటి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందెవరు. రాజ్యాంగం కన్నా నీ పరిస్థితి క్లిష్టంగా ఉన్నట్లుంది. అసెంబ్లీ చరిత్రలోనే ఎక్కడా లేదు ఒక మహిళను ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేయడం’ అని శాసన మండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు దుయ్యబట్టారు.
జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కినట్లుగా ఉందని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. టీడీపీ పాలనలో జిల్లాలో పలు పరిశ్రమలు మూతపడ్డాయని అన్నారు. మోదీ చర్యలకు భయపడి అభివృద్ధి గాలికి వదిలేశారని విమర్శించారు. కేవలం ఐటీ నోటీసులకే దేశంలోని అందరి కాళ్లు చంద్రబాబు పట్టుకుంటున్నారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇంటింటి సర్వే పేరుతో మోసాలు చేస్తూ, ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణ చూడలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment