విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జక్కంపూడి రాజా
సాక్షి, రాజమహేంద్రవరం సిటీ : తనను భూకబ్జాదారుడిగా చిత్రీకరించి బురదజల్లే ప్రయత్నం చేస్తున్న టీడీపీ నాయకుల కుట్రలను తిప్పికొడతామని కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో తన తాతయ్య, జడ్జి కొమ్మాల చక్రపాణి తనకున్న ఆస్తిలోని ఎకరా 70 సెంట్ల భూమిని 80–15ఏ సర్వే నంబర్ ద్వారా తన తల్లి జక్కంపూడి విజయలక్ష్మి పసుపు కుంకుమ మాన్యంగా వచ్చిందన్నారు. దాన్ని 1994లో చెల్లుబోయిన వీరరాఘవులు, బాబూరావు అనే ఇద్దరు అన్నదమ్ములకు అమ్మి వేశామన్నారు. తాతయ్యకు చెందిన మిగిలిన భూమి అమ్మివేయగా ప్రస్తుతం 1.23 ఎకరాలు 80–15బి, 80–20ఏ, 80–20బి సర్వే నెంబర్లలో ఉందన్నారు.
తమ భూమిని కోనుగోలు చేసిన వ్యక్తులు అదే సర్వే నెంబర్లలో ఇప్పటికి వ్యవసాయం ఫలాలు పొందుతున్నారు. అయితే టీడీపీ మాత్రం వైఎస్సార్ సీపీపైనా, తన పైనా బురదజల్లే ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టిందన్నారు. తన తల్లి జక్కంపూడి విజయలక్ష్మి 25 ఏళ్ల క్రితం అమ్మిన భూమి సర్వే నెంబర్లు వేరని, తన అమ్మమ్మ పేరున ఉన్న సర్వే నెంబర్లు వేరని ఆయన రికార్డులను విలేకరులకు ప్రదర్శించారు. కానీ అమ్మ అమ్మిన భూమి.. అమ్మమ్మ వద్ద ఉన్న భూమి సర్వే నెంబర్లలో ఉందని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఈ విషయంపై తహసీల్దార్ సర్వే జరిపి ఎవరి భూమి ఎక్కడ ఉందో స్పష్టం చేశారు.
టీడీపీ నాయకుల తీరు దారుణం
టీడీపీ నాయకులు వ్యక్తిగత సమస్యను వైఎస్సార్ సీపీకి, తనకు అంటగట్టే ప్రయత్నం చేస్తూ కోనసీమలో ఫ్లెక్సీలు కట్టారని జక్కంపూడి రాజా అన్నారు. శెట్టిబలిజలకు అన్యాయం చేస్తున్నారని టీడీపీ ప్రచారం చేస్తోందన్నారు. ఈ విధానం సరికాదని హెచ్చరించారు. తన తండ్రి బీసీలకు పెద్దపీట వేశారన్నారు. చెల్లుబోయిన వేణుకు ఉన్నతస్థానం కల్పించింది తన తండ్రి రామ్మోహనరావు అని గుర్తు చేశారు. ఇదే భూమిపై గతంలో తన మామయ్య ఫిర్యాదులపై మూడు కేసులు నమోదు అయ్యాయని, అప్పటి ప్రభుత్వం ఏమాత్రం చర్యలు చేపట్టలేదన్నారు. ఇటీవల 20 రోజుల క్రితం తన మావయ్యపై దాడి చేసి అక్కడ షెడ్‌ను తగులబెట్టారని దీనిపై కేసు నమోదైందన్నారు.
ఇదే విషయంపై గత నెల 23న కాకినాడలో శెట్టి బలిజ పెద్దగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోష్ వద్ద సంప్రదింపులకు ఏర్పాటు చేశామని, కానీ ఆ వర్గం నుంచి ఎవ్వరూ హాజరు కాలేదన్నారు. తనపై కుట్రలు ఆపకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని జక్కంపూడి రాజా హెచ్చరించారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై ప్రకాశ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలి పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు లంక సత్యనారాయణ, మాసా రామజోగ్, మాజీ కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, పిల్లి నిర్మల, ఈతకోట బాపన సుధారాణి, న్యాయవాది ధర్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment