
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
విజయవాడ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గాంధీ జయంతి రోజు కూడా పచ్చి అబద్ధాలు చెప్పారని వైఎస్సార్‌సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతికి ఆంక్షలు పెట్టి నిరుద్యోగులను మోసగిస్తున్నారని విమర్శించారు. కోటికిపైగా నిరుద్యోగులు ఉంటే కేవలం 2 లక్షల మందికి మాత్రమే నిరుద్యోగ భృతి ఇస్తారా అని ప్రశ్నించారు. లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేవలం 20 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తారా అని ప్రశ్నించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కూడా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. సీపీఎస్ రద్దు కోసం ఉపాధ్యాయులు పోరాడుతూ వైఎస్ జగన్‌ని కలిస్తే వారిని సస్పెండ్ చేసే ప్రయత్నం చేయడం దారుణమన్నారు.
యువనేస్తం ప్రచారానికి కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు విదేశీ పర్యటనలకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడం వల్ల ఏపీకి ఒరిగింది శూన్యమన్నారు. ఎన్నికలకు 6 నెలల ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయడంపై ఎన్నికల కమిషన్ కూడా ఎందుకు మౌనంగా ఉందనే సందేహం వ్యక్తం చేశారు. యువనేస్తం కార్యక్రమంపై యువత తీవ్ర అసంతృప్తితో ఉందని తెలిపారు. యువనేస్తం పూర్తిగా మోసపూరితమని అన్నారు. తమ పార్టీ యువ నాయకుడు వంగవీటి రాధాకి పార్టీలో పూర్తి ప్రాధాన్యత ఉందని, ఆయన మా పార్టీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు.