
విజయనగరం, సాలూరు: రాబోవు ఆంధ్రప‍్రదేశ్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో వైఎస్సార్‌సీపీ పొత్తు పెట్టుకుట్టుందని టీడీపీ నాయకులు ప్రచారం చేయడం నిజంగా శోచనీయమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర పేర్కొన్నారు. అసలు రాష్ట్రంలో లేని పార్టీతో ఏ విధంగా పొత్తు పెట్టుకుంటామని ఈ సందర్భంగా రాజన్న దొర ప్రశ్నించారు. తమ పార్టీ 175 నియోజకవర్గాల్లో సింగిల్‌గా పోటి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు.
దీనిలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద‍్రబాబు నాయడుపై రాజన్న దొర మండిపడ్డారు. ఆయన పూటకో మాట.. రోజుకో మాట మాట్లాడుతూ తాను చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా చెబుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలైన తృణమూలు కాంగ్రెస్, డీఎంకే, ఎస్‌పిలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపిన మాదిరిగానే, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించారని రాజన్న దొర పేర్కొన్నారు.