ఎంపీ అభ్యర్థిపై తప్పుడు ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు | YSRCP MP Candidate Raghuram Krishnam Raju Complains Against TDP And Janasena Over False Campaign | Sakshi
Sakshi News home page

ఎంపీ అభ్యర్థిపై తప్పుడు ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు

Published Sun, Mar 31 2019 3:40 PM | Last Updated on Sun, Mar 31 2019 3:40 PM

YSRCP MP Candidate Raghuram Krishnam Raju Complains Against TDP And Janasena Over False Campaign - Sakshi

వైఎస్సార్‌సీపీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురాం కృష్ణం రాజు(పాత చిత్రం)

సాక్షి, భీమవరం: భీమవరంలో ఈ నెల 29న జరిగిన సినీ అభిమానుల సంఘాల సమావేశంలో తాను మద్యం తాగి తూలుతూ మాట్లాడానని సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురాం కృష్ణం రాజు ఫిర్యాదు చేశారు. భీమవరం పోలీస్‌స్టేషన్‌తో పాటు నరసాపురం పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వేణుగోపాల్‌ రెడ్డిలకు రఘురాం కృష్ణంరాజు తరపున ఆయన న్యాయవాది సత్యనారాయణ ఫిర్యాదు లేఖ అందజేశారు. తన ప్రసంగాన్ని మార్ఫింగ్‌ కూడా చేశారని, స్లో మోషన్‌లో చూపిస్తూ తనపై ప్రజలకు తప్పుడు అభిప్రాయం కలిగేలా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోన్న లింక్‌ల వివరాలను పోలీసులకు అందజేశారు.

తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు తమ సామాజిక మాధ్యమాలలో కూడా తప్పుడుగా వైరల్‌ చేసిన విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ ఛానల్‌ ఏబీఎన్‌ ఆంధ్ర జ్యోతిలో కూడా తప్పుగా ఉద్దేశపూర్వకంగా కథనం ప్రసారం చేసి తన ప్రతిష్టను దెబ్బ తీశారని లేఖలో వివరించారు. ఎన్నికల కోడ్‌ నిబంధనలు ఉల్లంఘించి తప్పుడు ప్రచారం చేస్తోన్న బాధ్యులపై సైబర్‌ క్రైం కింద చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ కోరారు. అలాగే పశ్చిమగోదావరి కలెక్టర్‌, ఎస్పీ, నర్సాపురం, ఏలూరు డీఎస్పీలకు సైతం రఘురాం కృష్ణం రాజు ఫిర్యాదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement