సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడియాశలు చేశారని వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ద్వజమెత్తారు. ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదాను నాలుగేళ్లపాటు కేంద్రం వద్ద తాకట్టు పెట్టిన చంద్రబాబు, ఇప్పుడు ప్రజలకు మభ్యపెట్టడానికి కొంగ దీక్షలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు ఏముఖం పెట్టుకొని ధర్మపోరాటం పేరుతో దీక్ష చేస్తున్నారంటూ నిలదీశారు. ఆనాడు సభలో హోదా పదేళ్లు ఇవ్వాలని జైట్లీ, వెంకయ్యనాయుడు డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రత్యేకహోదా పదేళ్లు ఇస్తానని మోదీ అంటే కాదు పదిహేనేళ్లు తెస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారని, నేడు ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెడుతూ ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టిస్తామని ప్రధాని మోదీ ఇచ్చారని, కానీ అధికారంలోకి రాగానే హోదా ఇవ్వలేమని మాట మార్చారంటూ మేకపాటి దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ కావాలంటూ చెప్పి రాష్ట్ర భవిష్యత్తును కాలరాశారని విమర్శించారు. తెలుగుదేశం ఎంపీలు నాలుగేళ్లపాటు కేంద్రంలో మంత్రి పదవులు అనుభవించి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారంటూ విమర్శించారు. జైట్లీ ప్యాకేజీని ప్రకటించినప్పుడు అంగీకరించిన బాబు ఇప్పుడు.. హోదా కావాలంటూ యూటర్న్ తీసుకున్నారంటూ మండిపడ్డారు.
ప్రత్యేక హోదాపై మొదటినుంచి పోరాడుతున్నది వైఎస్సార్ సీపీ ఒక్కటేనని మేకపాటి స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వల్లే ఇంకా ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉందని మేకపాటి అన్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేగలిగే సత్తా ఒక్క వైఎస్ జగన్ కే ఉందన్నారు. చంద్రబాబు వంచనకు మారుపేరు అని ఆయన ద్వజమెత్తారు. 25 పార్లమెంట్ సభ్యులను ఇస్తే హోదా తెస్తామంటూ మరోసారి మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిప్డడారు. ఎన్నికలలో ఇచ్చిన 600 వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలుచేయలేదని, రైతులు, డ్రాక్రామహిళలు, నిరుద్యోగులు ఇలా అందరిని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది అంటూ ఎద్దేవా చేశారు.
నైతిక విలువలకు పాతరేసిన వ్యక్తి బాబు అని, ఇక ఆయన్ను ప్రజలు ఏమాత్రం సహించరని రాజమోహన్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటం కోసం అందరూ వైఎస్ జగన్‌కు మద్దతు పలకి, చంద్రబాబుకు బుద్ధి వచ్చే విధంగా చేయాలని కోరారు. వాగ్ధానాలను మెడలు వంచి సాధించే పరిస్దితులు రాబోతున్నాయని, ఒక్కసారి జగన్ కు అవకాశం ఇస్తే తండ్రి కంటే మిన్నగా పరిపాలన అందిస్తారని అన్నారు. 20 మందికి తక్కువ కాకుండా ఎంపీలను వైఎస్సార్‌సీపీ ఇస్తే వైఎస్ జగన్ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు అందిస్తారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment