వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశంలో పాల్గొన్న జిల్లా ముఖ్య నేతలు
అనంతపురం సిటీ: ఎన్నికల హామీలు విస్మరించి, ప్రజలను వంచించిన చంద్రబాబు తీరును ఎండగడతామని వైఎస్సార్‌సీపీ జిల్లా ఇన్‌చార్జ్, ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. నాలుగేళ్ల పాలనలో ప్రజలను ఎలా ముప్పుతిప్పలు పెట్టిందీ వివరిస్తామన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర రెండువేల కిలోమీటర్ల మైలురాయి మరో రెండు రోజుల్లో దాటనుందని, యాత్రకు సంఘీభావంగా ఈ నెల 14, 15 తేదీల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. 16వ తేదీన కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి.. కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. సంఘీభావ పాదయాత్రలు – కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాలపై శుక్రవారం అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ అథితి గృహంలో పార్టీ పార్లమెంటు అధ్యక్షులు, సమన్వయకర్తలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
రైతు కన్నీరు తుడవని రుణమాఫీ
బేషరతుగా రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎన్నో మెలికలు పెట్టడంతో పూర్తిస్థాయిలో రుణాలు మాఫీ కాలేకపోయాయని మిథున్‌రెడ్డి తెలిపారు. రుణవిముక్తులు కాలేక ఎన్నో రైతు కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. రుణమాఫీ పథకం రైతుల కన్నీటిని పూర్తిగా తుడవలేకపోయిందన్నారు. జిల్లాలో హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు వస్తున్నా ఒక్క ఎకరం కూడా తడిపిన పాపాన పోలేదన్నారు. రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కూడా టీడీపీ ప్రభుత్వం కల్పించలేకపోయిందన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమం కోసం ఎలాంటి పథకాలను రూపొందించబోతున్నదీ వివరించాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రైతు సంక్షేమం విస్మరించారు
తెలుగుదేశం ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీలో ఇంకా రూ.1100 కోట్ల బకాయిలున్నాయని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోతే ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడలేదన్నారు. హంద్రీ–నీవా ద్వారా మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఒక్క ఎకరం కూడా తడపలేకపోయిందని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లలో రూ.లక్షన్నర కోట్లు అప్పులు చేసిన బాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేక పోయారన్నారు. ప్రపంచ స్థాయి రాజధానిగా చెబుతున్న అమరావతి.. డిజైన్ల స్థాయి దాటడం లేదని ఎద్దేవా చేశారు.
వంచక పాలనకు బుద్ధి చెప్పండి
ప్రజలను అడుగడుగునా వంచనకు గురిచేస్తున్న టీడీపీ పాలనకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కడపల శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరిగిపోని గురుతుగా నిలిచిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలను కూడా బాబు సర్కార్ తుంగలో తొక్కిందన్నారు.
ప్రజాసమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరుబాట
ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ ఆదినుంచి పోరాడుతోందని వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంటు అధ్యక్షులు శంకరనారాయణ అన్నారు. పార్టీ అధినేత ప్రతి వర్గం, ప్రతి రంగంలోని అన్ని వర్గాల వారి సమస్యలు తెలుసుకున్నారని చెప్పారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అవసరమైన కార్యక్రమాలు చేపడతారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి, అనంతపురం పార్లమెంటు అధ్యక్షులు, అర్బన్ సమన్వయకర్త అనంత వెంకటరామిరెడ్డి, అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త తలారి రంగయ్య, హిందూపురం పార్లమెంటు సమన్వయ కర్త నదీమ్ అహ్మద్, నియోజకవర్గాల సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, డాక్టర్ సిద్దారెడ్డి, దుద్దుకుంట శ్రీదరరెడ్డి, నవీన్‌నిశ్చల్, డాక్టర్ తిప్పేస్వామి, జొన్నల గడ్డ పద్మావతి, ఉషశ్రీ చరణ్, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మహాలక్ష్మీ శ్రీనివాసులు, కిష్టప్ప, రాగేపరుశురాం, సంయుక్త కార్యదర్శి శివారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు సాంబశివారెడ్డి పాల్గొన్నారు.
తాడిపత్రిలో పాదయాత్రను విజయవంతం చేయండి
అనంతపురం: ప్రజా సంకల్పయాత్ర రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 14, 15 తేదీల్లో తాడిపత్రి నియోజకవర్గంలో చేపట్టే సంఘీభావ పాదయాత్రను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా ఇన్‌చార్జ్, ఎంపీ మిథున్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఇతర నాయకులతో మిథున్‌రెడ్డి మాట్లాడారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఇప్పటికే పార్టీ బలోపేతమైందని, కేతిరెడ్డి పెద్దారెడ్డి నాయకత్వాన్ని బలపరిచి మరింత పటిష్టం చేయాలని కోరారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పెద్దారెడ్డిని ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి ఎమ్మెల్యే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment