ఏపీ బంద్‌ భగ్నానికి టీడీపీ విన్యాసాలు.. | YSRCP Slams C‍handrababu Naidu Maintaining Double Standards | Sakshi
Sakshi News home page

ఏపీ బంద్‌ భగ్నానికి టీడీపీ విన్యాసాలు..

Published Mon, Apr 16 2018 2:12 PM | Last Updated on Sat, Aug 18 2018 4:18 PM

YSRCP Slams C‍handrababu Naidu Maintaining Double Standards - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ బంద్‌ను భగ్నం చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.  ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్‌ సీపీ, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఇవాళ (సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ చేపట్టామని, ఇందులో బీజేపీ, టీడీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొన్నారన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలు తమ ఆకాంక్షను బంద్‌ ద్వారా చాటి చెప్పారన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌ సమావేశాలు ముగిశాక పదవులకు రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేశారని ఉమ్మారెడ్డి గుర్తు చేశారు. వారికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, రిలే దీక్షలు చేపట్టారన్నారు. ప్రత్యేక హోదా కోసం ఈ రోజు కూడా బంద్‌లో పాల్గొన్న నాయకులను చంద్రబాబు అరెస్టు చేయించారని, మహిళలను బలవంతంగా లాక్కెళ్లి స్టేషన్‌లో వేయించారన్నారు. ఈ ఘటనలతో చంద్రబాబు చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు అర్థమైందన్నారు.

చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతమా? రెండు నాల్కల దోరణీనా చెప్పాలన్నారు. టీడీపీ ఎంపీలను కూడా రాజీనామా చేయించి అందరం కలిసి పోరాడుదామని కోరితే ఎలాంటి స్పందన లేదన్నారు. అందరం కలిసి పోరాటం చేస్తే కేంద్రం దిగిరాక తప్పదన్నారు. అలాంటి పోరాటాలు చేయకుండా బంద్‌లో పాల్గొన్న వారిని అరెస్టు చేయడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించి పోరాటానికి సిద్ధం కావాలని ఆయన కోరారు.

మోదీ దీక్ష విడ్డూరం
గతంలో ఎన్నడు లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరాహార దీక్ష చేశారన్నారు. 13 రోజుల పాటు పార్లమెంట్‌ సమావేశాలు సక్రమంగా నిర్వహించకుండా అడ్డుకున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంట్‌ను సక్రమంగా నిర్వహించాల్సిన  బాధ్యత ప్రధానిది కాదా అన్నారు. ఇదే ప్రభుత్వం గతంలో పార్లమెంట్‌ సమావేశాలను అడ్డుకున్న వారిని సస్పెండ్‌ చేసి సమావేశాలు కొనసాగించారన్నారు. ప్రధాని, బీజేపీ నాయకత్వం ఫెయిల్యూర్‌ అయి దీక్షకు కూర్చోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రధాని కూర్చున్నారని చంద్రబాబు కూడా దీక్షకు దిగడం దారుణమన్నారు. ఎవరి మీద చంద్రబాబు దీక్ష చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. దీక్ష చేసే బదులు టీడీపీ కూడా బంద్‌లో పాల్గొని ఉంటే బాగుండేది కదా అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ కోసమే కదా మేం బంద్‌ చేపట్టిందన్నారు.

చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి
బంద్‌ను భగ్నం చేసేందుకు టీడీపీ చేసిన విన్యాసాలు సరైంది కాదన్నారు. గతంలో పీవీ నరసింహరావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నంద్యాలలో ఆయన పోటీ చేశారన్నారు. ఆంధ్రుడు ప్రధాని అయ్యాడని ఎన్‌టీ రామారావు తన అభ్యర్థిని నిలపలేదన్నారు. కేంద్రం అన్యాయం చేస్తే..వారికి వ్యతిరేకంగా బంద్‌ చేపడితే ఆ బంద్‌ను భగ్నం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేస్తే..చంద్రబాబు రాజ్యసభ సభ్యులు ఎందుకు రాజీనామా చేయడం లేదని అనడం బాధాకరమన్నారు.

ఏ నాడు కూడా రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసిన ఘటన లేదన్నారు. నాడు భోఫోర్స్‌ కుంభకోణంపై నాడు ఎన్‌టీ రామారావు నాయకత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలోని 12 పార్టీలోని 148 మంది ఎంపీల్లో 106 మంది లోక్‌సభ సభ్యులతో మాత్రమే రాజీనామా చేయించారని, అక్కడ కూడా రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయలేదన్నారు. నీవు ఎన్‌టీ రామారావు వారసత్వం అనుకుంటే ఇలాంటి మాటలు మాట్లా్లడవని చంద్రబాబుకు సూచించారు. రాష్ట్రమంతా ఒకే దోరణిలో వెళ్లి నిరసన వ్యక్తం చేయాలన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడదామంటే చంద్రబాబు కలిసి రాలేదని, ఇవాళ అన్ని పార్టీలు బంద్‌కు పిలుపునిస్తే..టీడీపీ కలిసి రాలేదన్నారు. ఏ విధంగా ప్రజలు చంద్రబాబును నమ్ముతారని ప్రశ్నించారు. ఇలాంటి విధానాలను చంద్రబాబు మానుకోవాలని, ఇప్పటికైనా టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement