వైఎస్సార్‌సీపీ.. జయహో | YSRCP to Sweep In Andhra Pradesh Elections | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ.. జయహో

Published Tue, Apr 9 2019 5:11 PM | Last Updated on Wed, Apr 10 2019 6:52 PM

YSRCP to Sweep In Andhra Pradesh Elections - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ప్రభంజనమే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం ఖాయం.. పలు జాతీయ సంస్థలు చేసిన ఒపీనియన్‌ పోల్స్‌ అన్నీ ఇదే విషయాన్ని ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఏ సర్వే పరిశీలించినా రాబోయే ఎన్నికల్లో జగన్‌ గెలుపు ఖాయమని, అధికారం వైఎస్సార్‌సీపీదేనని పేర్కొంటున్నాయి. అంతేగాక జాతీయ రాజకీయాల్లోనూ జగన్‌ కీలకం కాబోతున్నారని కూడా అవి చెబుతున్నాయి. లోక్‌సభలో నాలుగవ అతి పెద్ద పార్టీగా వైఎస్సార్‌సీపీ అవతరిస్తుందని ఓ జాతీయ సర్వే సంస్థ తన ఒపీనియన్‌ పోల్స్‌లో స్పష్టం చేసింది.

తాజాగా లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌–తిరంగ టీవీ–ది హిందూ–దైనిక్‌ భాస్కర్‌ ప్రీపోల్‌ సర్వేలోనూ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ హవానే కొనసాగుతుందని వెల్లడైంది. వైఎస్సార్‌సీపీకి 46 శాతం ఓట్లు వస్తాయని, అధికార టీడీపీ 36 శాతానికే పరిమితమవుతుందని ఈ సర్వేలో తేలింది. టీడీపీ కంటే వైఎస్సార్‌సీపీకి ఓటు షేర్‌ పది శాతం ఎక్కువగా ఉండటాన్ని సంస్థ ప్రస్తావించింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 108–124 సీట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. అదే సమయంలో టీడీపీ 41–57 సీట్లకు పరిమితమవుతుందని, ఇతరులకు 5–10 స్థానాలు వచ్చే వీలుందని తెలిపింది. దేశవ్యాప్తంగా మార్చి 24–31 తేదీల మధ్య దేశవ్యాప్తంగా ప్రీపోల్‌ సర్వేను ఈ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. 

అన్ని సర్వేలదీ జగన్‌ మాటే:

గత రెండు నెలలుగా ప్రసిద్ధ జాతీయ సంస్థలు చేసిన సర్వేలన్నింటిలోనూ ఆంధ్రప్రదేశ్‌లో జగనే అధికారంలోకి వస్తారని, ఆయన్ను సీఎంగా చేయాలని జనం కోరుకుంటున్నారని తేలింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌తోపాటు ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ సభలకు జనం పోటెత్తారు. ఈ ప్రజాకర్షణ నూటికి నూరుపాళ్లు ఓటింగ్‌గా మారుతోందనే అభిప్రాయం సర్వేల్లో ప్రతిబింబించింది. ఎన్‌డీటీవీలాంటి ప్రతిష్టాత్మక సంస్థలు రాష్ట్రంలో 20కిపైగా ఎంపీ సీట్లు వైఎస్సార్‌సీపీకి వస్తాయని తేల్చాయి. 19 ఎంపీ సీట్లు కైవసం చేసుకోవడంతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేస్తుందని ‘రిపబ్లిక్‌ టీవీ–సీఓటర్‌ సర్వే’లో వెల్లడైంది.

టీడీపీకంటే వైఎస్సార్‌సీపీకి 8.2% అధికంగా ఓట్లు రానున్నాయని, టీడీపీ 6 ఎంపీ సీట్లకే పరిమితమవుతుందని తేల్చిచెప్పింది. వైఎస్సార్‌సీపీకి 41.3 శాతం ఓట్లు, టీడీపీకి 33.1 శాతం ఓట్లు దక్కే వీలుందంది. వైఎస్సార్‌సీపీ 21 లోక్‌సభ స్థానాల్లోనూ, 121 నుంచి 130 అసెంబ్లీ స్థానాల్లో విజయదుందుభి మోగిస్తుందని సీపీఎస్‌ సర్వే తేల్చింది. జగన్‌ నాయకత్వాన్నే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, అధికార టీడీపీ 45 నుంచి 54 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లకే పరిమితం కానుందని, జనసేన ఒకటి రెండు ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది.

ఏపీకి కాబోయే సీఎం జగనేనని ఇండియా టీవీ సర్వే కూడా తేల్చింది. చంద్రబాబు కంటే ప్రతిపక్షనేతకు 9శాతం ఆధిక్యం వచ్చిందని స్పష్టం చేసింది. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, జగన్‌ జాతీయ నేతగా బలోపేతమవుతారని తెలిపింది. జనసేన పోటీలోనే లేదని, ఒక్క లోక్‌సభ స్థానం కూడా ఆ పార్టీకి దక్కదని అన్ని సర్వే సంస్థలూ తేల్చాయి.  మార్పు కోరుకుంటున్న జనం టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గత ఐదేళ్లలో చోటు చేసుకున్న అవినీతి, పెరిగిన నిరుద్యోగ సమస్య, సీఎం రోజుకో మాట, రోజుకో రీతిలో మాటతప్పిన తీరు పట్ల జనం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వివిధ సర్వేల్లో తేలింది. ప్రజా సమస్యలను గాలికొదిలి సొంత స్వార్థం చూసుకుని ఇసుక, మట్టి దోచుకోవడం కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతున్నట్టు తేలింది. మొత్తమ్మీద ఆంధ్ర ప్రజలు గట్టిగా మార్పు కోరుతున్నారని సర్వేలన్నీ తేల్చాయి. జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లు దృఢ నిశ్చయానికి వచ్చినట్లు సర్వే సంస్థలతోపాటు   విశ్లేషకులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement