చట్లమిట్ట వద్ద మహిళా కూలీలతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
యర్రగొండపాలెం/పెద్దారవీడు: టీడీపీ ప్రభుత్వానికి ఇక్కడి కరువు కనిపించడం లేదని, రైతు గోడు వినే సమయమే లేదని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. పశ్చిమ ప్రకాశాన్ని సస్యశ్యామలం చేసే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి మీన మేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. వెలింగొండ సాధన కోసమే తాను పాదయాత్ర చేస్తున్నానని, ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు ప్రజలంతా ముందుకు రావాలని కోరారు.
ప్రజా పాదయాత్ర సోమవారం పెద్దారవీడు, పెద్దదోర్నాల మండలాల్లో సాగింది. పెద్దారవీడు మండలంలోని చట్లమిట్ల ప్రాంతంలోని పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు, రైతు కూలీలతో వైవీ మాట్లాడారు. మిరప నారు నాటుతున్న కూలీలను పలకరించారు. వర్షాలు కురవక పంటలను పండించలేక పోతున్నామని, ఆదివారం రాత్రి కురిసిన స్వల్ప వర్షానికి మిరప నారు నాటుకుంటున్నామని రైతులు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితేనే పశ్చిమ ప్రకాశం సస్యశ్యామలం అవుతుందన్నారు.
సరైన నాయకుడి కోసం జనం ఎదురుచూస్తున్నారు..
టీడీపీ నేతలు నాలుగేళ్ల కాలమంతా రాష్ట్రాన్ని దోచుకోవటానికే కేటాయించారని విమర్శించారు. సీఎం జిల్లాలో పర్యటించిన ప్రతిసారీ వెలిగొండ ప్రాజెక్టుపై వాగ్దానాలు చేయడమే తప్ప అందుకు కావలసిన నిధులు కేటాయించకుండా అబద్దపు మాటలతో ప్రజలను మాయ చేస్తున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధితో రాష్ట్రాని పాలించే నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, అంటువంటి రోజులు అతి సమీపంలో ఉన్నాయని ఆయన అన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకొని వెలిగొండ ప్రాజెక్టు సాధించుకుందామని పిలుపునిచ్చారు.
వైవీకి వినతుల వెల్లువ..
పాదయాత్ర ప్రారంభించిన కొద్ది దూరంలో చట్లమిట్ల గ్రామ మహిళలు వైవీని కలిశారు. వర్షాలు లేక ఇప్పటి వరకు నాట్లు వేయలేదని, మా మండలానికి పాదయాత్ర రాగానే ఆదివారం రాత్రి వర్షం కురవడంతో నాట్లు వేస్తున్నామంటూ మిర్చినారు చూపించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయించాలని ఏర్వ సుబ్బమ్మ, ఇటుక నారాయణమ్మ, షేక్ నాసర్‌బి, పేరమ్మ, తదితరులు సుబ్బారెడ్డిని కోరారు. ఆ సంకల్పంతోనే తాను పాదయాత్ర చేస్తున్నానని వైవీ బదులిచ్చారు.
- మార్గం మధ్యలో కొందరు ముస్లింలు కలసి పాదయాత్రకు మద్దతు పలికారు.
- కర్రోల గ్రామానికి చెందిన యాగంటి గంగయ్య రైతు పొలంలో సాగు చేసిన మిరప పంటను పరిశీలించారు.
- మాచరాజుకుంట క్రాస రోడ్డు వద్ద పెద్దదోర్నాలకు చెందిన పెరుమాళ్ల గోపాలక్రిష్ణ వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని వైవీని కోరారు.
- మరుగుదొడ్లు, సబ్సిడీ రుణాలు టీడీపీ మద్దతుదారులకు మాత్రమే మంజూరు చేస్తున్నారని మద్దకట్టల గ్రామంలో ఎస్సీలు వైవీ దృష్టికి తెచ్చారు.
- ఉపాధి పనులు కల్పించడం లేదని, టీడీపీ నాయకుల పెత్తనం ఎక్కువగా ఉందని సానికవరం మహిళలు విన్నవించారు. వైవీ మాట్లాడుతూ ఎక్కడ చూసిన టీడీపీ నాయకులు దోచుకోవడమే కానీ ప్రజలు మేలు చేయాలనే ఆలోచన లేదన్నారు. ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరి న్యాయం జరుగుతుందన్నారు.
- సానికవరం గ్రామం బస్టాండ్ సెంటర్లలో దివంగత నేత డాక్టర్ రాజశేఖరరెడ్డి విగ్రాహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పాదయాత్ర చేస్తున్న గ్రామాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పూలతో ఘన స్వాగతం పలికారు. గ్రామ సమీపంలోని రామక్రిష్ణ ధ్యాన మందిరంలో స్థానికుల కోరిక మేరకు వైవీ మొక్కను నాటారు.
- ఇతర జిల్లాల నేతల సంఘీభావం
వైవీ పాదయాత్రకు ఇతర జిల్లాల నుంచి వచ్చిన నేతలు సంఘీభావం తెలిపారు. గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా క్రిష్ణమూర్తి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, యువజన విభాగం నేత కావటి మనోహర్‌నాయుడు, కృష్ణా జిల్లా నుంచి ఎమ్మెల్సీ ఆళ్ల నాని, కర్నూలు జిల్లా నేత చంద్రమౌళి, పి.జగదీశ్వరరెడ్డి, భాస్కరరెడ్డి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నాయకులు పెండం దొరబాబు, చిట్టిబాబు, ఎం.మోహన్, ఆర్‌వీవీ సత్యనారాయణచౌదరి, గవులూరి దొరబాబు, పిల్లి సిరివాల తదితరులు సుబ్బారెడ్డి వెంట కొంతదూరం నడిచి మద్దతు పలికారు.
యర్రగొండపాలెం నియోజకవర్గం సమన్వయకర్త, సంతనూతలపాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో సాగిన యాత్రలో మార్కాపురం ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, సంతనూలతలపాడు సమన్వయకర్త సుధాకర్‌బాబు, కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా ప్రభాకర్, నాయకులు వైవీ భద్రారెడ్డి, చిన్ని శ్రీమన్నారాయణ, కందూరి గురుప్రసాద్, వెన్నా హనుమారెడ్డి, ఎం.షంషీర్‌అలీబేగ్, కేవీ రమణారెడ్డి, జంకె ఆవులరెడ్డి, వై.వెంకటేశ్వరరావు, ఉడుముల శ్రీనివాసరెడ్డి, దుంపా చెంచిరెడ్డి, వెన్నా పెద్దపోలిరెడ్డి, కె.ఓబులరెడ్డి, షేక్ జబీవుల్లా, పాలిరెడ్డి కృష్ణారెడ్డి, ఆవుల వెంకటరెడ్డి, రోషిరెడ్డి, ముసలారెడ్డి, ధనలక్ష్మిబాయి, అరుణాబాయి, దుగ్గెంపుడి వెంకటరెడ్డి, రోజ్‌లిడియాలు ఉన్నారు.
పాదయాత్ర సాగిందిలా...
ప్రజా పాదయాత్ర సోమవారం పెద్దారవీడు మండలంలోని చట్లమిట్ల క్రాస్‌రోడ్ నుంచి ఉదయం 10.10 గంటలకు ప్రారంభమైంది. కర్రోలక్రాస్ రోడ్డు, మాచరాచకుంట క్రాస్‌రోడ్డు, మద్దెలకట్ట, సానికవరం, చిన్నగుడిపాడుకు సమీపంలోని ఆర్డీటీ సంస్థ వద్దకు చేరింది. భోజన విరామం అనంతరం తిరిగి 3.30గంటలకు పాదయాత్ర ప్రారంభం అయింది. పెద్దదోర్నాల మండలం చిన్నగుడిపాడు, చిన్నదోర్నాల అడ్డరోడ్డు, జమ్మిదోర్నాల క్రాస్ రోడ్డు, హసనాబాద్ క్రాస్‌రోడ్డు, పెద్దదోర్నాల వరకు సాగి ఐనముక్కల గ్రామానికి సమీపంలో రాత్రి 6.15గంటలకు ముగిసింది. 13వ రోజు మొత్తం 16 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది.
నేటి షెడ్యూల్..
ప్రజా పాదయాత్ర మంగళవారం ఉదయం ఐనముక్కల నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి యడవల్లి, గంటవానిపల్లె క్రాస్‌రోడ్డు, కొత్తూరు, వెలిగొండ టన్నెల్ వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం వెలిగొండ సొరంగాన్ని పరిశీలించి సాయంత్రం 4 గంటలకు వైవీ బహిరంగ సభలో మాట్లాడతారు.
Comments
Please login to add a commentAdd a comment