
ఉదయం శిరసనంబేడు దాటి కాస్త ముందుకెళ్లగానే.. నడవలేక నడవలేక నాకేసి వస్తున్న ఓ అవ్వ కనిపించింది. నడుం పూర్తిగా వంగిపోయి, చేతికర్ర సాయంతో ఎంతో కష్టంగా వచ్చిన ఆ అవ్వను చూడగానే కదిలిపోయాను. ఆ అవ్వ నావద్దకు వచ్చి నా చెంపను తడిమింది. ఏం కావాలవ్వా.. అని అడిగాను. ‘నాకేమీ వద్దు నాయనా.. నువ్వు ముఖ్యమంత్రివై మా ఊరికి రావాలి.. అదే చాలు’ అని దీవించింది. ‘నీలో నాన్నను చూసుకుంటున్నానయ్యా’ అంటూ ఎంతో మురిసిపోయింది. 80 ఏళ్లు పైబడిన ఆ అవ్వ చూపించిన ఆప్యాయతకు, ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను.?
చావలి దాటాక, హైవేపై నడుస్తున్నప్పుడు.. దారి పక్కనే చాలా ఇటుక బట్టీలు కనిపించాయి. చాలామంది కూలీలు, మహిళలు నన్ను చూడాలని పరుగు పరుగున వచ్చారు. వారితోపాటు చిన్నచిన్న పిల్లలు కూడా పరుగులెడుతూ ఆతృతగా వచ్చి నన్ను కలిశారు. ఆ పిల్లలంతా మట్టికొట్టుకుని ఉన్నారు. తలలు మాసిపోయాయి. బట్టలు మాసిన చిరుగుపాతలు. ఆ పిల్లలను దగ్గరకు తీసుకుని వారి చేతులు తడిమాను. ఆ అరచేతులు కాయలు కాసి ఉన్నాయి. ఏమైందమ్మా.. అని వారి తల్లులను అడిగాను. ఆ పిల్లలు కూడా ఇటుక బట్టీలలో పనిచేస్తున్నారట. పలకాబలపం పట్టాల్సిన చిట్టిచేతులు మట్టితట్టలు మోయాల్సి వస్తో్తందని తెలిసి కలతచెందాను.
ఆటపాటలతో, చదువులతో వెల్లివిరియాల్సిన బాల్యం ఇటుక బట్టీలలో వాడిపోతోందని తెలిసి చాలా బాధపడ్డాను. పిల్లలను బడులకు పంపించాలమ్మా.. అని అనగానే.. ‘తినడానికే లేదు. ఇక చదువులెక్కడ సార్.. మాకూ చదివించుకోవాలనే ఉంది. కానీ బడికెట్లా పంపం?’ అన్నారు. ఇలాంటి తల్లుల కోసమే నవరత్నాలలో పొందుపర్చిన అమ్మఒడి పథకం గురించి వివరించాను. పిల్లలను బడికి పంపితే ఆ తల్లులకు సంవత్సరానికి రూ.15,000 ఇస్తానని చెప్పాను. అది విన్నాక తమ పిల్లల్ని ఇబ్బందుల్లేకుండా బాగా చదివించుకునే రోజులు రానున్నాయన్న ఆనందం వారిలో కనిపించింది. ఆ పిల్లలను పెద్ద చదువులు చదివించి, గొప్ప స్థానాల్లో చూడాలన్న నా ఆశయాన్ని తెలియజేసినప్పుడు ఆ తల్లుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది.
భోజన విరామానికి ముందు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రతినిధులు కలిశారు. చంద్రబాబు వారినెలా మోసం చేశాడో చెప్పారు. నాన్నగారి హయాంలో 13 వేల దేవాలయాలకు ధూప దీప నైవేద్యాల కింద రూ.2,500 ఇచ్చేవారు. బాబుగారు ఆ దేవాలయాల సంఖ్యను మూడు వేలకు కుదించివేశాడు. ఎన్నికలప్పుడు ఓట్లకోసం.. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి రూ.500 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఆ కార్పొరేషన్‌కు ఇస్తానన్న నిధులు ఇవ్వకపోగా, అన్యాయాన్ని ప్రశ్నించిన సదరు కార్పొరేషన్ చైర్మన్‌ను రాత్రికిరాత్రి అవమానకరంగా తొలగించి, కార్పొరేషన్‌ను చంద్రబాబు నిర్వీర్యం చేశారని వాపోయారు.
మంచి పథకాలకు తూట్లు పొడవడం, అబద్ధపు హామీలతో నెట్టుకురావడం బాబుగారికి ఉగ్గుపాలతో పెట్టిన విద్యమరి. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఎన్నికలకు ముందు ఓట్లకోసం అన్ని కులాలకూ తాయిలాలు ప్రకటించి, బూటకపు హామీలిచ్చి, అవసరం తీరాక వాటిని తీర్చకపోగా.. ప్రశ్నించిన కుల సంఘాలను బెదిరించడాన్ని ఏమనుకోవాలి? అది దేనికి సంకేతం? అదే మీ నైజమా?
Comments
Please login to add a commentAdd a comment