సాక్షి, రంగారెడ్డి జిల్లా : ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీపై యంత్రాంగం ఆచితూచి అడుగులు వేస్తోంది. తొలుత కొత్త జిల్లాల ప్రాతిప దికన భర్తీ చేపట్టాలని నిర్ణయించిన యంత్రాంగం.. ప్రస్తుతం పునరాలోచనలో పడింది. ఉమ్మడి జిల్లానా? కొత్త జిల్లానా.. వీటిలో ఏ ప్రాతిపదికన నియామకాలు చేయాలని తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని గతేడాది చివరలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో.. జిల్లా యంత్రాంగం తొలుత కొత్త జిల్లా ప్రాతిపదికన ఖాళీలను తేల్చేందుకు రంగంలోకి దిగింది. ఒకటి రెండు మినహా దాదాపు అన్ని శాఖల్లో కేడర్ వారీగా ఖాళీల లెక్కలను సైతం తేల్చారు.
గత డిసెంబర్ నెలాఖరులోపు నియామకాల నోటిఫికేషన్‌ను కూడా వెలువరిస్తామని అధికారులు సైతం ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఇది ఉన్నట్లుండి బ్రేక్ పడింది. అంతకుముందు కొత్త జిల్లాల ప్రాతిపదికన టీచర్ల ఖాళీ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా.. ప్రభుత్వ తీరును సైతం న్యాయస్థానం తప్పుబట్టింది. కొత్త జిల్లాలు కాకుండా.. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిన రీ నోటిఫికేషన్ జారీ చేయాలని తీర్పు చెప్పిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలో సవరణ నోటిఫికేషన్ కూడా ఇటీవల వెలువడింది. అయితే, కొత్త జిల్లాను పరిగణలోకి తీసుకుని వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తే ఇదే తరహాలో న్యాయపరమైన చిక్కులు వస్తే ఇబ్బంది తప్పదని యంత్రాంగం గ్రహించింది.
ఈనేపథ్యంలో కొత్త జిల్లా కాకుండా.. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయాలన్న ఏకాభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని ఆయా విభాగాల్లో ఖాళీ పోస్టులను తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఖాళీల సంఖ్య పూర్తిగా తేలేందుకు మరో పది రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ నియామకాల్లో దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంది. గత పది నెలల్లో ఆయా విభాగాల్లో కొందరు బదిలీ అయ్యారు. మరికొందరికి పదోన్నతులు లభించాయి. పలువురు ఉద్యోగ విరమణ పొందారు. వీటితోపాటు రోస్టర్ పాయింట్ అమలు ద్వారా కొన్ని పోస్టులు ఉద్భవించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయా విభాగాల్లో ఖాళీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
‘దివ్యాంగ’ పోస్టులపై ఆచితూచి!
Published Mon, Jan 22 2018 10:00 AM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment