కూటి కష్టాలు! | ration biometric signal problems in telangana | Sakshi
Sakshi News home page

కూటి కష్టాలు!

Published Sat, Feb 10 2018 5:55 PM | Last Updated on Sat, Feb 10 2018 7:12 PM

ration biometric signal problems in telangana - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా :  ఈపాస్‌ మిషన్స్‌ సిగ్నల్స్‌పై రేషన్‌ సరుకుల పంపిణీ ఆధారపడింది. ఒకప్పుడు కార్డు, డబ్బులు తీసుకెళ్తే సరుకులు అందజేసేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. సిగ్నల్స్‌ ఉంటేనే సరుకులు పొందాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కోసారి సిగ్నల్స్‌ సరిగా లేకపోవడంతో సరుకులు పంపిణీ ప్రక్రియ నిలిచిపోతోంది. ఫలితంగా పలుమార్లు కార్డుదారులు రేషన్‌ దుకాణాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. యంత్రాంగం చర్యల వల్ల ప్రజాధనం మిగులుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం కార్డుదారులు చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. వీటిని కూడా సరిచేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని జిల్లావాసులు వ్యక్తంచేస్తున్నారు.  

సమయ పాలన ఏదీ?  
చాలా రేషన్‌ దుకాణాల నిర్వాహకులు సమయపాలన పాటించడం లేదు. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో విధిగా సరుకులు పంపిణీ చేయాలి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరిచే ఉండాలి. కానీ, సమయ పాలన ఎక్కడా అమలు కావడం లేదని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. కొందరు డీలర్లు ఉదయం పూటకే పరిమితం చేస్తున్నారు. సాయంత్రం దుకాణం తెరవడం లేదు. మొబైల్‌ సిగ్నల్స్‌ లేకపోవడంతో షాపులను మూసివేయాల్సి వస్తోందని డీలర్లు చెబుతున్నారు. వేలి ముద్రల కష్టాలు బయోమెట్రిక్‌ విధానం మరికొందరు కార్డుదారులకు శాపంగా మారింది. వృద్ధులతో పాటు మట్టి, రాయి పని, మేస్త్రీలుగా పనిచేసే వారి వేలిముద్రలు చెరిగిపోవడం సహజం. ఇటువంటి కార్డుదారులు సరుకులు తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ–పోస్‌ యంత్రాలు వీరి వేలి ముద్రలు స్వీకరించడం లేదు. 

రెండుతో సరి!  
2014 మే నెల వరకు రేషన్‌ దుకాణాల ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు, వస్తువులు సరఫరా చేసేవారు. ఇప్పుడు సరుకుల సంఖ్యలో భారీగా కోతపడింది. చివరకు సరుకుల సంఖ్య రెండింటికే పరిమితం కావడంపై పేద కుటుంబాలు అసంతృప్తి వ్యక్తచేస్తున్నాయి. ఆహార భద్రత కార్డుదారులకు బియ్యం, కిరోసిన్‌ మాత్రమే అందజేస్తున్నారు. అంత్యోదయ కార్డుదారులకు దీనికి అందనంగా చక్కెర పంపిణీ చేస్తున్నారు. మిగిలిన సరుకులను కూడా అందజేస్తే తమకు భారం తప్పుతుందని కార్డుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  

కార్డులను మరిచారు 
కొత్త రేషన్‌కార్డులు ఇంకా అందడం లేదు. దాదాపు ఏడాదిగా దరఖాస్తు చేసేకునే ప్రక్రియ కూడా నిలిచిపోయింది. కనీసం కార్డుల్లో చేర్పులు, మార్పులకు కూడా అవకాశం లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చాలామంది లబ్ధిదారులు మీ–సేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అంతేగాక ఇప్పటికే రేషన్‌ పొందుతున్న వారు ఇంటర్నెట్‌ పత్రాలపై ఆధాపడుతున్నారు. కనీసం వీరు కూడా శాశ్వత కార్డులకు నోచుకోవడం లేదు. రేషన్‌కార్డులు అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు కాలేదు. 

15 రోజుల బెంగ 
ప్రతినెలా ఒకటి నుంచి 15వ తేదీల్లోపే రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయంతో కార్డుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విధానాన్ని గత నెలలో అమలు చేశారు. సెలవులు అధికంగా రావడం వల్ల 17వ తేదీ వరకు సరుకులు అందజేసినా.. చాలా మంది వాటికి దూరమయ్యారు. ఈ నెల నుంచి నిక్కచ్చిగా 15వ తేదీ వరకే పంపిణీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు అందడంతో కార్డుదారుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా కూలీ పనులకు వెళ్లేవారు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే సిగ్నల్స్‌ సరిగా ఉండడం లేదు. పొట్టకూటి కోసం కూలీలు ఉదయం వెళ్లి చీకటి పడ్డాక ఇంటికి చేరుకుతుంటారు. ఇటువంటి వారికి పంపిణీ రోజుల కుదింపు శరాఘాతంగా మారుతోంది. కనీసం ప్రతినెలా 20వ తేదీ వరకైనా సరుకులు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  

ఒక్కోకార్డుదారునికి 18 నిమిషాలు 
మొయినాబాద్‌ (చేవెళ్ల): మొబైల్‌ సిగ్నల్స్‌ సమయానికి అందకపోవడంతో చాలా మంది రేషన్‌ షాపులకు రోజుల తరబడి తిరుగుతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. మొయినాబాద్‌ మండల కేంద్రంలోని రేషన్‌ షాపును పరిశీలించగా.. రేషన్‌ తీసుకునేందుకు సుమారు యాబై మంది వరుసలో నిలిచి ఉన్నారు. సిగ్నల్స్‌ లేకపోవడంతో ఒక్కో కార్డుదారుడు రేషన్‌ సరుకులు పొందడానికి 18 నిమిషాల సమయం పట్టింది. మొయినాబాద్‌లో 700 రేషన్‌ కార్డులు ఉన్నాయి. అయితే ఈ నెల 1వ తేదీ నుంచే రేషన్‌ ఇవ్వాల్సి ఉండగా ఈ పాస్‌ మిషన్‌ను సాఫ్ట్‌వేర్‌ మార్పుకోసం తీసుకెళ్లి సోమవారం ఇచ్చారు. అదేరోజు సాయంత్రం, మంగళవారం సరుకుల పంపిణీకి డీలర్‌ ప్రయత్నించగా సిగ్నల్‌ సరిగా రాక కేవలం 50 మంది వరకు మాత్రమే అందజేశారు. 15వ తేదీ వరకు మాత్రమే రేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో ఆ గడువులోగా పంపిణీ ఎలా పూర్తిచేయాలో అర్థంకావడం లేదని డీలర్‌ పేర్కొన్నాడు. 

వేలి ముద్రలు పడలేదని.. 
నా వేలి ముద్రలు పడడం లేదని ఈ నెల బియ్యం ఇవ్వలేదు. నాకు కొడుకులు లేరు. నా భర్త కూడా చనిపోయాడు. కార్డుపై నెలకు ఇచ్చే 35 కిలోలపై ఆధారపడి బతుకుతున్నాను. ఈ నెలలో సరుకులు ఇంకా ఇవ్వలేదు. ఇస్తారో లేదో కూడా చెప్పడంలేదు.  
    – మొదళ్ల రుక్కమ్మ, మల్కారం, శంషాబాద్‌. 

15 రోజులే షాప్‌ తీస్తున్నారు
కూలికి వెళ్లి తిరిగి వచ్చేలోగా దుకాణాన్ని మూసి వేస్తున్నారు. బయో మెట్రిక్‌ విధానం అని వేలిముద్ర తీసుకొని బియ్యాన్ని ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో సిగ్నల్స్‌ సరిగ్గా లేకపోవడంతో గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీంతో బియ్యం కోసం రెండు మూడు రోజులు రేషన్‌ దుకాణానికి వెళ్లాల్సి వస్తుంది.  
    – గోవింద్, కేశంపేట 

ఈ–పాస్‌ మిషన్‌తో ఇబ్బందులు

సిగ్నల్స్‌ లోపం, సర్వర్‌ సమస్యతో ఈ పాసు మిషన్‌ సక్రమంగా పనిచేయడం లేదు. పైగా నిత్యం కూలి పని చేసే లబ్ధిదారుల చేతి వేలి ముద్రలు రావడం లేదు. దీంతో వారికి రేషన్‌ సరుకులు సకాలంలో ఇవ్వలేక పోతున్నాం. కొంత మంది వృద్ధులకు కూడా వేలి ముద్రలు రావడం లేదు. ప్రతినెల 15వ తేదీలోపు సరుకులు ఇవ్వాలని నిబంధన. ఆ తరువాత  వచ్చిన లబ్ధిదారులకు సరుకులు ఇవ్వడం కుదరదు. దీంతో లబ్ధిదారులు సరుకులు ఉండి కూడా ఎందుకు ఇవ్వవంటూ మాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
– సాతిరి సత్తయ్య, రేషన్‌ డీలర్, ఆరుట్ల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement