మార్కెట్‌లోకి చేప | 7 Fish markets, 3 cold storage soon in sangareddy | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి చేప

Published Thu, Jan 18 2018 9:40 AM | Last Updated on Thu, Jan 18 2018 9:40 AM

7 Fish markets, 3 cold storage soon in sangareddy - Sakshi

పుల్‌కల్‌(అందోల్‌): మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి పథంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వరాలు కురిపించింది. మత్స్యకారులు ఇక మీద చేపలను అమ్ముకునేందుకు మార్కెట్లలో దళారుల బెడద లేకుండా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే జిల్లాలో పలు చోట్ల ఫిష్‌ కోల్డ్‌ స్టోరేజీలను ఏర్పాటు చేయనుంది. వాటితోపాటు ఫిష్‌ మార్కెట్లను ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన నిధులు సైతం మంజూరు చేసింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతోపాటు దళారీల బారిన పడకుండా ఉండనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో సంగారెడ్డి మినహా ఎక్కడా ఇప్పటి వరకు చేపల మార్కెట్లు లేవు. దీంతో మత్స్యకారులు పట్టిన చేపలను సంగారెడ్డికి తరలించేందుకు దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది.

దీంతో వారు మత్స్యకారుల వద్ద తక్కువ ధరలకు కొనుగోలు చేసి మార్కెట్లో మాత్రం అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని గమనించిన ప్రభుత్వం ప్రతీ పట్టణంలోనూ ప్రత్యేకంగా ఫిష్‌ మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లాకు ఏడు ఫిష్‌ మార్కెట్లను మంజూరు చేస్తూ, వాటికి కావాల్సిన నిధులను సైతం విడుదల చేసింది. వీటిలో పటాన్‌చెరులో మాత్రం మోడల్‌ ఫిష్‌ మార్కెట్‌ను ఏర్పాటు చేయడం కోసం రూ. 2 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. అక్కడ స్థలాన్ని కేటాయించాల్సి ఉంది. సంగారెడ్డి పట్టణంలో రెండవ ఫిష్‌ మార్కెట్‌కు అవసరమైన స్థలాన్ని కేటాయించారు. సదాశివపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, పటాన్‌చెరు, జిన్నారంతోపాటు సింగూర్‌లో ఫిష్‌ మార్కెట్లను ఏర్పాటు చేయడం కోసం నిధులు మంజూరు చేశారు. అందుకు ఆయా పట్టణాలలో స్థలాన్ని కేటాయించి మత్స్య శాఖ అధికారులకు ఇచ్చినట్లయితే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

కోల్డ్‌ స్టోరేజీలతో మేలు..
ప్రధానంగా చేపలు పట్టిన వెంటనే మార్కెట్‌కు తరలించే అవకాశం లేనందున ప్రభుత్వం కోల్డ్‌ స్టోరేజీలను ఏర్పాటు చేయడం వల్ల మత్స్యకారులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మార్కెట్‌లో కూరగాయలు తీసుకున్నట్లుగానే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేపల మార్కెట్‌కు వెళ్లి కొనుక్కునే సదుపాయం కలుగుతుంది. దీని వల్ల మత్స్యకారులకు నష్టం జరగకుండా ఉంటుంది. పట్టిన చేపలను కోల్డ్‌ స్టోరేజీలో భద్రపర్చి తర్వాత అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కోల్డ్‌ స్టోరేజీలు లేనందున మత్స్యకారులు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు.

కోల్డ్‌ స్టోరేజీ ఇలా..: కోల్డ్‌ సోరేజీలో ఐస్, ఏసీ సౌకర్యం కలిగిన కూలింగ్‌ గదులు, నీటి సౌకర్యం, చేపలను నిల్వ చేసేందుకు అనువైన గదులు, విద్యుత్‌తోపాటు 230 కేవీ సామర్థ్యం కలిగిన జనరేటర్లను ఇక్కడ ఏర్పాటు చేస్తారు.

నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు అంగీకారం..
ఏ రకంగానూ మత్స్యకారులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. దీనికి తాజాగా తీసుకున్న నిర్ణయమే  నిదర్శనం. రాష్ట్రంలో పాలను ఎలా అయితే కొనుగోలు చేస్తోందో అదే తరహాలో తెలంగాణ కో ఆపరేటీవ్‌ సొసైటీల ఆధ్వర్యంలో చేపలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు గాను వారం, లేదా నెల చొప్పున నేరుగా మత్స్యకారుల ఖాతాలో డబ్బులు జమ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మార్కెట్‌తోపాటు ప్రభుత్వమే కొనుగోలు చేసినట్లయితే వారికి అన్ని రకాల సహకారం అందించినట్లు అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  

రవాణా సౌకర్యం కల్పిస్తాం
మత్స్యకారులు నేరుగా చేపలను పట్టణాలకు తరలించేందుకు అవసరమైన రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం. ఇందుకుగాను గడిచిన రెండు సంవత్సరాల్లో రూ.27 కోట్ల వ్యయంతో ఆటోలు, జీప్, మోపెడ్‌ వాహనాలను మత్స్యకారులకు అందించాం. వాటితోపాటు అడిగిన వారికి మోటార్‌ సైకిళ్లను సైతం ఇచ్చాం. ఇది కేవలం మార్కెట్‌ సౌకర్యం కల్పించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగమే.  – సుజాత, మత్స్యశాఖ ఏడీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement