
న భూతో...న భవిష్యతి!
జీవితం మొత్తంలో ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిలైనా గెలిస్తే తమ జన్మ ధన్యమైపోతుందని రాకెట్ పట్టిన సమయంలో ప్రతి టెన్నిస్ క్రీడాకారుడు
►నాదల్ నయా చరిత్ర
►పదోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సొంతం
►ఒకే గ్రాండ్‌స్లామ్‌ను పదిసార్లు గెలిచిన ఏకైక ప్లేయర్‌గా ఘనత
►అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన జాబితాలో రెండో స్థానానికి
►ఫైనల్లో వావ్రింకాపై వరుస సెట్‌లలో ఘనవిజయం
►రూ. 15 కోట్ల 10 లక్షల ప్రైజ్‌మనీ కైవసం
జీవితం మొత్తంలో ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిలైనా గెలిస్తే తమ జన్మ ధన్యమైపోతుందని రాకెట్ పట్టిన సమయంలో ప్రతి టెన్నిస్ క్రీడాకారుడు కలలు కంటాడు. అలాంటిది ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌ను ఒకటికాదు... రెండుకాదు.. మూడుకాదు... ఏకంగా పదిసార్లు గెలిచి స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ కొత్త చరిత్ర లిఖించాడు. పదోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సాధించి మట్టి కోర్టులపై మకుటంలేని మహారాజు తానేనని మరోసారి నిరూపించాడు. ఒకే గ్రాండ్‌స్లామ్‌ను పదిసార్లు గెలిచిన నాదల్ గతంలో ఎవరూ సాధించని... భవిష్యత్‌లోనూ దాదాపుగా మరెవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నట్లే.
పారిస్: అతని పనైపోయిందని అన్న వారందరికీ దిమ్మదిరిగే జవాబు లభించింది. పూర్తి ఫిట్‌గా ఉంటే విశ్వరూపం చూపిస్తానని స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ మళ్లీ రుజువు చేశాడు. రికార్డుస్థాయిలో పదోసారి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. టెన్నిస్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. రొలాండ్ గారోస్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ నాదల్ 6–2, 6–3, 6–1తో మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్)ను చిత్తుగా ఓడించాడు. 2 గంటల 5 నిమిషాలపాటు జరిగిన ఈ తుది పోరులో ఆద్యంతం నాదలే ఆధిపత్యం చలాయించాడు. సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై గెలుపొందిన వావ్రింకా ఫైనల్లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. విజేతగా నిలిచిన నాదల్‌కు 21 లక్షల యూరోలు (రూ. 15 కోట్ల 10 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. నాదల్ గతంలో 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014లలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ సాధించాడు.
⇒ ఈ విజయంతో నాదల్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సంఖ్య 15కు చేరుకుంది. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జాబితాలో నాదల్ రెండో స్థానానికి చేరుకున్నాడు. 18 టైటిల్స్‌తో ఫెడరర్ అగ్రస్థానంలో ఉండగా... 14 టైటిల్స్‌తో సంప్రాస్ మూడో స్థానంలో ఉన్నాడు.
⇒ఓవరాల్‌గా నాదల్ కెరీర్‌లో ఇది 73వ సింగిల్స్ టైటిల్. క్లే కోర్టులపై 53వది. 13 సార్లు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడిన నాదల్ మొత్తం 79 మ్యాచ్‌ల్లో గెలిచి, కేవలం రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు.
⇒ ఒక్క సెట్ కోల్పోకుండా గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను మూడుసార్లు (ఫ్రెంచ్ ఓపెన్ 2008, 2010, 2017లో) గెలిచిన ఏకైక ప్లేయర్‌గా నాదల్ గుర్తింపు పొందాడు. గతంలో ఫెడరర్, నస్టాసే (రొమేనియా), రోజ్‌వెల్ (ఆస్ట్రేలియా) ఒక్కోసారి ఈ ఘనత సాధించారు.
⇒ఈ విజయంతో నాదల్ 2014 తర్వాత మళ్లీ రెండో ర్యాంక్‌కు చేరుకోనున్నాడు.
⇒మోంటెకార్లో, బార్సిలోనా ఓపెన్ టైటిల్స్‌ను కూడా నాదల్ పదిసార్లు చొప్పున గెలిచాడు.
⇒1972 తర్వాత ఒక సీజన్‌లోని తొలి రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను 30 ఏళ్లకుపైబడిన వారు గెలవడం ఇదే ప్రథమం. ఈ ఏడాది 35 ఏళ్ల ఫెడరర్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో, 31 ఏళ్ల నాదల్ ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచారు. 1972లో 37 ఏళ్ల కెన్ రోజ్‌వెల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను, 34 ఏళ్ల ఆండ్రెస్ గిమెనో ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలిచారు.
⇒ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ 35 గేమ్‌లు మాత్రమే కోల్పోయాడు. ఈ రికార్డు బోర్గ్ (స్వీడన్–32 గేమ్‌లు, 1978లో) పేరిట ఉంది.
నిజంగా నమ్మశక్యంగా లేదు. లా డెసిమా (స్పానిష్ భాషలో పదోసారి) ఘనత సాధించినందుకు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. నా అనుభూతిని మాటల్లో వర్ణించలేను. నా అంకుల్ టోనీ లేకపోతే నేను పదిసార్లు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచేవాణ్ని కాదు.
– నాదల్