ఫ్లోరిడా (అమెరికా): అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సర్క్యూట్‌లో జూనియర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీగా పరిగణించే ఎడ్డీ హెర్ జూనియర్ చాంపియన్‌షిప్ లో సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా మానస్ ధామ్నె చరిత్ర సృష్టించాడు. ఫ్లోరిడాలో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన అండర్–12 బాలుర సింగిల్స్ ఫైనల్లో పుణేకి చెందిన 11 ఏళ్ల మానస్ 3–6, 6–0, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో మాక్స్‌వెల్ ఎక్స్‌టెడ్ (అమెరికా)పై విజయం సాధించాడు. డబుల్స్ విభాగంలో మానస్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో మానస్ (భారత్)–ఆరవ్ హడా (నేపాల్) జంట 6–7 (5/7), 2–6తో సె హ్యుక్ చో–మిన్సెక్ మాయెంగ్ (కొరియా) జోడీ చేతిలో ఓడిపోయింది.
జూనియర్స్ విభాగంలో ఎడ్డీ హెర్ ఓపెన్, ఆరెంజ్ బౌల్ ఓపెన్ టోర్నీలను గ్రాండ్‌స్లామ్ టోరీ్నలుగా భావిస్తారు. 2008లో యూకీ బాంబ్రీ ఆరెంజ్ బౌల్ ఓపెన్ విజేతగా నిలిచాడు. అదే ఏడాది ప్రపంచ జూనియర్ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఎడ్డీ హెర్ టోర్నీలో 90 దేశాల నుంచి 2 వేల మంది జూనియర్ ఆటగాళ్లు అండర్–12, అండర్–14, అండర్–16 బాలబాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీపడ్డారు. గతంలో షరపోవా (రష్యా), ఆండీ రాడిక్ (అమెరికా) తదితరులు ఈ టోర్నీలో విజేతలుగా నిలిచి ఆ తర్వాత సీనియర్స్ విభాగంలోనూ మెరిపించారు.
Comments
Please login to add a commentAdd a comment